ప్రభాస్ రేంజ్ లో గేర్ మారుస్తున్న స్టార్స్
ఇప్పటిదాకా టాలీవుడ్‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయడంలో ప్రభాస్ మాత్రమే సక్సెస్ అయ్యాడు.;
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే ఓ గొప్ప విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక స్టార్ హీరోల సినిమాలు రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే, ఇటీవల చాలామంది హీరోలు ‘‘ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమవుతుందా అనే డౌట్స్ అయితే గట్టిగానే క్రియేట్ అవుతున్నాయి.
ఇప్పటిదాకా టాలీవుడ్‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయడంలో ప్రభాస్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. సలార్-1 రిలీజ్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే రాజా సాబ్ రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అంటే 2025లో ప్రభాస్ రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నాడు. అంతేకాదు, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ మాత్రమే అసలైన పనిపట్టుదల చూపిస్తున్నాడనిపిస్తోంది.
ఇప్పటికే ఇతర స్టార్ హీరోలు కూడా ఈ స్పీడ్‌ను మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. ఇక రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేశాడు. వెంటనే బుచ్చిబాబు సినిమాను 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ నాటికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమా కూడా లైన్లో ఉంది. ఇదే విధంగా ఎన్టీఆర్ కూడా వరుసగా ప్రాజెక్టులు ఫైనల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వార్ 2 ఆగస్ట్ 14న విడుదల కానుండగా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా రెడీ అవుతోంది. ఇక దేవర-2 కూడా వెంటనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే, అల్లు అర్జున్ మాత్రం ఈ రేసులో వేగం పెంచేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ లో ఉన్న ఆయన తర్వాత త్రివిక్రమ్ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా పూర్తవడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చని టాక్ ఉంది. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే, చిరంజీవి, బాలకృష్ణ మాత్రం చాలా బలమైన స్పీడ్‌తో పనులు పూర్తిచేస్తున్నారు. చిరు ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకోగా, మరో సినిమా కూడా లైన్లో ఉంది.
బాలకృష్ణ కూడా వరుసగా సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా డాకు మహరాజ్ తో హిట్ కొట్టాడు. ఇక అఖండ 2, గోపిచంద్ మలినేని సినిమాలను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. వెంకీ అయితే ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక నాగ్ కూడా రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. మొత్తానికి, ప్రభాస్ స్థాయిలో వరుసగా సినిమాలు చేయడానికి మిగిలిన హీరోలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఆడియన్స్ కూడా స్టార్ హీరోల నుంచి తరచుగా సినిమాలు కోరుకుంటున్నారు. మరి, రానున్న రోజుల్లో ఈ గేమ్ ఎలా మారుతుందో వేచి చూడాలి.