పాత్రల కోసం ప్రాణం పెడుతున్న హీరోలు!
స్టార్ ఇమేజ్, మాస్ డైలాగులతో మాత్రమే థియేటర్లకు రప్పించే రోజులు దాటిపోయాయి. కథ డిమాండ్ మేరకు నటుడు పాత్రలోకి ఎంతవరకు పరకాయ ప్రవేశం చేశాడనేదే? ఇప్పుడు ముఖ్యం.
స్టార్ ఇమేజ్, మాస్ డైలాగులతో మాత్రమే థియేటర్లకు రప్పించే రోజులు దాటిపోయాయి. కథ డిమాండ్ మేరకు నటుడు పాత్రలోకి ఎంతవరకు పరకాయ ప్రవేశం చేశాడనేదే? ఇప్పుడు ముఖ్యం. ఈ విషయాన్ని గ్రహించిన టాలీవుడ్ అగ్ర హీరోలు స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి పాత్రల విశ్వసనీయత కోసం ప్రాణం పెడుతున్నారు. శారీరకంగా ఎంతో కష్టపడుతూ కఠినమైన శిక్షణలు తీసుకుంటూ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబె డుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ `పెద్ది` కోసం అసాధారణమైన రీతిలో సిద్దమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఆయన పాత్రకు వైవిధ్యమైన శారీరక ఆకృతులు అవసరం కావడంతో ఒకేసారి రన్నర్ , రెజ్లర్ లుక్స్ కోసం కఠినమైన శిక్షణ తీసుకుని బరిలోకి దిగారు. ఒకేసారి ఇన్ని రకాలుగా సన్నధం అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అయినా చరణ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సక్సెస్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం
డ్రాగన్ కోసం ఎలా మేకవర్ అవుతున్నారో? తెలిసిందే. పాత్రకు పక్కాగా సరిపోవడం కోసం తారక్ ఏకంగా 14 కేజీల బరువు తగ్గారు. ఇలా బరువు తగ్గడం అనేది శారీరక మార్పు మాత్రమే కాదు. దానికి ఎంతో మానసిక నిబ్బరం, కఠినమైన డైట్ నియమాలు అవసరం.
తెరపై లుక్ అత్యంత పవర్‌ఫుల్‌గా, సరికొత్తగా ఉండాలని ఎన్టీఆర్ పడుతున్న శ్రమ ఆయనకున్న వృత్తిపరమైన కసిని నిరూపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిత్యం మేకోవర్లతో సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తుంటారు. రాకా ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలోకి వెళ్లడం విశేషం. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ - అందులోని మెళకువలను నేర్చుకోవడం కోసం విదేశీ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటు న్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా వినూత్నమైన విద్యలను అలవర్చుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ సైతం కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రం కోసం మునుపెన్నడూ లేని విధంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాల లుక్ పరంగా ఎన్నో మార్పులు చేసారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో అత్యంత కఠినమైన శిక్షణ సైతం పూర్తి చేస్తున్నారు. అలాగే సాంప్రదాయ యుద్ధ విద్యలు, ఆధునిక శారీరక శ్రమల కలయికతో మహేష్ సరికొత్త రూపంలోనూ అలరించనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రదర్శిస్తున్న ఈ అంకితభావం ఆ సినిమాల విజయాలకే పరిమితం కాదు. రాబోయే తరాల నటులకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది.