స్టార్ హీరోల సినిమాల వేగంపై ఆందోళన!

టాలీవుడ్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో జైత్రయాత్ర సాగిస్తోంది. `బాహుబలి` నుండి మొదలైన ఈ ధోరణి నేడు వేల కోట్ల వసూళ్లను సాధించే స్థాయికి చేరింది.;

Update: 2026-04-15 15:30 GMT

టాలీవుడ్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో జైత్రయాత్ర సాగిస్తోంది. `బాహుబలి` నుండి మొదలైన ఈ ధోరణి నేడు వేల కోట్ల వసూళ్లను సాధించే స్థాయికి చేరింది. అయితే ఈ భారీ విజయాల వెనుక ఒక ఆందోళనకరమైన అంశం దాగి ఉంది. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు సమయం కేటాయిస్తుండటం చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒకే ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి కూర్చోవడం వల్ల ఇండస్ట్రీలో ఒక రకమైన స్తబ్దత నెలకొంటుంది.

సినీ పరిశ్రమ అనేది కేవలం కళ మాత్రమే కాదు. వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఒక స్టార్ హీరో సినిమా సెట్స్‌పై ఉన్నంత కాలం ఆ ప్రాజెక్టు పూర్త‌య్యే వ‌ర‌కూ ఆ డ‌బ్బు అంతా పెట్టుబ‌డిగానే క‌నిపిస్తుంది. లావాదేవీల‌న్నీ నిర్మాత చుట్టూనే ఉంటాయ‌మి. అదే హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే? ఆ డబ్బు మార్కెట్లోకి వేగంగా తిరిగి వస్తుంది. తద్వారా నిర్మాత‌ల‌కు కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి లభిస్తుంది. కానీ మూడేళ్లకు ఒక సినిమా రావడం వల్ల ఇండస్ట్రీలో మనీ సర్క్యులేషన్ దెబ్బతింటోందని కొంద‌రు నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

దీనివల్ల నిర్మాతలు వడ్డీల భారం మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. అలాగే చిన్న , మధ్య తరహా సినిమాలకు థియేటర్ల వద్ద ఆశించిన బజ్ రావడం లేదు. కంటెంట్ బాగుంటే ప‌ర్వాలేదు. అదీ రెండు ..మూడు రోజులు ఎదురు డ‌బ్బులిచ్చి ఆడించాల్సిన రోజులివి. ఆ పై సినిమా బాగుంద‌నే టాక్ వ‌స్తే అప్పుడు జ‌నాలు థియేట‌ర్ కు వెళ్తు న్నారు. దీంతో స్టార్ హీరోల సినిమాలే థియేటర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు వచ్చే సందడి వల్ల ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు వస్తాయి.

అయితే స్టార్ హీరోల సినిమాల మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ గ్యాప్‌ను ఓటీటీలు భర్తీ చేస్తున్నాయి. దీనివల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేసే ప్రమాదం ఉంది. థియేటర్లు కళ తప్పడం వల్ల వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక హీరో తన సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే? ఆ హీరోపై ఉండే క్రేజ్ కాలక్రమేణా తగ్గే అవకాశం ఉంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రేక్షకుల జ్ఞాపకశక్తి తక్కువ.

కొత్త కొత్త నటులు, వైవిధ్యమైన కంటెంట్ ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పుడు తమ అభిమాన హీరో కోసం మూడేళ్లు వేచి చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సినిమా విడుదలైనప్పుడు అది భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టవచ్చు. కానీ ఆ హీరో బ్రాండ్ వాల్యూని నిరంతరం నిలబెట్టుకోవాలంటే కనీసం ఏడాదికి ఒక సినిమా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా నాణ్యత కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నామని మేకర్స్ చెబుతుంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక అంశాలకు సమయం పడుతుందనేది వాస్తవమే. అయితే హాలీవుడ్ వంటి పరిశ్రమల్లో కూడా భారీ విజువల్స్ ఉన్న సినిమాలను పక్కా ప్లానింగ్‌తో తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నారు.

ఇక్క‌డ‌ కూడా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే పక్కాగా ప్లాన్ చేసుకుంటే మేకింగ్ సమయాన్ని తగ్గించవచ్చు. తద్వారా హీరోలు ఇతర సినిమాలపై దృష్టి పెట్టవచ్చని సినీ పండితులు సూచిస్తున్నారు. భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో పాటు, సమాంతరంగా చిన్న , మధ్య తరహా చిత్రాలను కూడా పూర్తి చేయడం వల్ల ఇండస్ట్రీకి ఊపిరి అందుతుంది. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరో సినిమాకు సంబంధించిన చర్చలు, లుక్ టెస్టులు పూర్తి చేస్తే వేగం పెరుగుతుంది. అప్పుడే ఇండస్ట్రీ ఆర్థికంగా బలోపేతం అవుతుంది . ప్రేక్షకులు కూడా థియేటర్లకు కనెక్ట్ అయి ఉంటారు.

Tags:    

Similar News