పాన్ వరల్డ్ గ్రాఫిక్స్ మాయలో పడి అసలైన ఎమోషన్ మర్చిపోతున్నారా?

టాలీవుడ్ ఇప్పుడు నేరుగా గ్లోబల్ మార్కెట్ మీద కన్నేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో లైనప్ లో ఉన్న భారీ ప్రాజెక్టులు చూస్తుంటే మన మేకర్స్ టార్గెట్ ఏంటో క్లియర్ గా తెలుస్తోంది.

Update: 2026-06-20 07:30 GMT

టాలీవుడ్ ఇప్పుడు నేరుగా గ్లోబల్ మార్కెట్ మీద కన్నేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో లైనప్ లో ఉన్న భారీ ప్రాజెక్టులు చూస్తుంటే మన మేకర్స్ టార్గెట్ ఏంటో క్లియర్ గా తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్లతో ఇంటర్నేషనల్ కాస్టింగ్ ను రంగంలోకి దింపుతున్నారు. ఇదంతా వినడానికి చాలా గర్వంగానే ఉన్నా ఈ ప్రాజెక్టుల వెనుక ఒక కొత్త టెన్షన్ సైలెంట్ గా మొదలైంది. మన స్టార్ డైరెక్టర్లు అంతా ఇప్పుడు హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ చేయాలనే కసితో పని చేస్తున్నారు.

దీనికోసం పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్ల మీదే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మన సినిమాలను నిలబెట్టిన అసలైన నాచురల్ ఎమోషన్ ను నెమ్మదిగా పక్కన పెట్టేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. కేవలం కంటికి కనిపించే గ్రాఫిక్స్ మాయలో పడిపోయి ఆ క్యారెక్టర్లకు ఉండాల్సిన సోల్ ని గాలికి వదిలేస్తున్నారా అనే అనుమానం రాక మానదు. ఉదాహరణకు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన ఒక బడా అడ్వెంచర్ ప్రాజెక్ట్ నే తీసుకుంటే అందులో హిస్టరీ, టైమ్ ట్రావెల్ అంటూ భారీ కాన్సెప్ట్ తో వెళ్తున్నారు.

ఇదంతా ఒకెత్తయితే అందులో హీరో పాత్ర తాలూకు ఎమోషన్ వర్కౌట్ అవ్వడం అనేది అసలైన పాయింట్. ఆ క్యారెక్టర్ పడే వేదన జనాలకు కనెక్ట్ కాకుండా ఎన్ని వందల కోట్లు పెట్టి వీఎఫ్ఎక్స్ చేసినా ఆడియన్స్ కు ఏమాత్రం రిజిస్టర్ అవ్వదు.

ఇక గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న మిగతా క్రేజీ యాక్షన్ ప్రాజెక్టులది కూడా ఇదే పరిస్థితి. వీటిలో కూడా ఫారిన్ ఆర్టిస్టులు ఉంటారని టాక్ నడుస్తోంది. స్క్రీన్ మీద ఫారిన్ వాళ్లు కనిపించగానే సినిమా రేంజ్ పెరిగిపోదు.

ఆ యాక్షన్ సీన్స్ వెనుక బలమైన కారణం ఉండాలి. సినిమాలో క్యారెక్టర్ తాలూకు ఇంటెన్స్ రివెంజ్ లాంటి పాయింట్ ఉంటేనే హాలీవుడ్ వాళ్లైనా సరే మన కథలతో కనెక్ట్ అవుతారు. మనకు ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది కేవలం మన క్వాలిటీ గ్రాఫిక్స్ చూసి కాదు. మన కథల్లో ఉండే పచ్చిదనం చూసి మాత్రమే. ఎప్పట్నుంచో మన సినిమాల్లో ఉండే ఆ ఎమోషనల్ కనెక్షన్ ప్రపంచంలో ఎక్కడా దొరకవు.

ఆ బలాన్ని వదిలేసి వాళ్లు ఎప్పటినుంచో చూపిస్తున్న గ్రీన్ మ్యాట్ విజువల్స్ తోనే మళ్లీ మెప్పించాలనుకోవడం కాస్త రిస్క్ తో కూడుకున్న పనే. ఆ విజువల్స్ వాళ్లకు చాలా కామన్. క్రియేటర్లు పెద్ద కలలు కనడం ఎప్పుడూ తప్పు కాదు. ఆ క్రమంలో బేసిక్ సోల్ ను వదిలేయకూడదు. స్క్రీన్ మీద వందల మంది విదేశీ యాక్టర్లు ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లో వేల కోట్ల గ్రాఫిక్స్ నడుస్తున్నా సరే, లీడ్ క్యారెక్టర్ ఏడ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టాలి. ఆ ఒక్క నాచురల్ కనెక్షన్ ఉంటేనే ఈ పాన్ వరల్డ్ టార్గెట్స్ అన్నీ అనుకున్నట్లుగా రీచ్ అవుతాయి. లేదంటే ఆ బడ్జెట్ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

Tags:    

Similar News