అప్పుడు వరుణ్‌తేజ్..ఇప్పుడు శర్వానంద్!
అలాంటి సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడాలంటే చాలా గట్స్ ఉండాలంటారు. కారణం ఆ ఐకానిక్ హిట్ తాలూకు ఇంపాక్ట్‌ని మళ్లీ కలిగించలేకపోతే ప్రేక్షకుల ఆదరణ లభించదు.;
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి సదరు హీరోల కెరీర్‌లని మలుపు తిప్పిన సినిమాలు ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయి చరగని ముద్ర వేస్తాయి. అలాంటి సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడాలంటే చాలా గట్స్ ఉండాలంటారు. కారణం ఆ ఐకానిక్ హిట్ తాలూకు ఇంపాక్ట్‌ని మళ్లీ కలిగించలేకపోతే ప్రేక్షకుల ఆదరణ లభించదు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది. అంతే కాకుండా ఐకానిక్ హిట్ సినిమా టైటిల్‌ని, దానికున్న ఇమేజ్‌ని చెడగొట్టారనే చెడ్డపేరు మూటగట్టుకున్న వారవుతారు.
అందుకే టాలీవుడ్‌లో చాలా మంది ఐకానిక్ హిట్ సినిమాల టైటిల్స్‌ని మళ్లీ వాడుకోవడానికి భయపడుతుంటారు. అయితే కొంత మంది అభిమానం పేరుతో వాడుకుంటూ ఆ క్రేజ్‌ని క్యారీ చేయలేక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడి పరాభవాల్ని ఎదుర్కొంటుంటే మర కొంత మంది హీరోలు మాత్రం చాలా పక్కాగా ప్లాన్ చేసుకుని ఐకానిక్ టైటిల్స్‌తో సినిమాలు చేస్తూ సక్సెస్‌లని దక్కించుకుని వాటికున్న గౌరవాన్ని, సెంటిమెంట్‌ని పెంచేస్తున్నారు. ఇలా ఎవర్ గ్రీన్ ఐకానిక్ టైటిల్స్‌ని మళ్లీ వాడి సూపర్ హిట్‌లని అందుకున్న హీరోలు అప్పుడు వరుణ్ తేజ్. ఇప్పుడు శర్వానంద్.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఐకానిక్ హిట్‌లుగా నిలిచిన సినిమాలు 'తొలిప్రేమ', 'తమ్ముడు'. ఇందులో 'తమ్ముడు' టైటిల్‌ని నితిన్ రీసెంట్‌గా వాడి భారీ డిజాస్టర్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన 'తమ్ముడు' భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అనిపించుకుని నితిన్‌తో పాటు దిల్ రాజుకు ఊహించని షాక్ ఇచ్చింది. అభిమాన హీరో ఐకానిక్ టైటిల్ వాడి హిట్టు కొట్టలేకపోయానని హీరో నితిన్ కూడా ఫీలయ్యాడు.
అయితే పవన్ కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీగా నిలిచి తనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించిన 'తొలిప్రేమ' టైటిల్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. తను హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్‌స్టోరీకి 'తొలిప్రేమ' టైటిల్‌ని తీసుకోవడం..అనుకున్నట్టే సూపర్ హిట్‌ని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో మరో ఐకానిక్ టైటిల్‌ని తీసుకుని హీరో శర్వానంద్ కూడా ఇదే ఫలితాన్ని దక్కించుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోష హీరోయిన్‌లుగా నటించిన మూవీ 'నారీ నారీ నడుమ మురారీ'.
అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టైటిల్‌ని తీసుకుని రొమాంటిక్ కామెడీ మూవీని చేశాడు. రామ్ అబ్బరాజ్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించగా సంయుక్త మీనన్, సాక్షీ వైద్య హీరోయిన్‌లుగా నటించారు. జనవరి 14న సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా ఆద్యంత వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి చాలా రోజుల తరువాత హీరో శర్వానంద్‌కు సక్సెస్‌ని అందించింది. ఐకానికి టైటిల్‌తో సినిమా ప్రకటించినప్పుడే దీన్ని చెడగొట్టకుండా ఉంటే చాలనే కామెంట్‌లు వినిపిస్తుంటాయి. ఆ కామెంట్‌లని దృష్టిలో పెట్టుకుని బాలయ్య టైటిల్‌కి శర్శా పూర్తి న్యాయం చేశాడు.