కంటెంట్ పై డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకం లేదా?
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ పుల్ ఫామ్ లో ఉన్నాడు. `అమరన్` తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.;
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ పుల్ ఫామ్ లో ఉన్నాడు. `అమరన్` తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో అతడి స్టార్ డమ్ రెట్టింపు అయింది. తెలుగులో మార్కెట్ మెరుగు పడింది. `అమరన్` బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో? శివ కార్తికేయన్ రేంజ్ ఒక్కసారిగా మారి పోయింది. ఇలాంటి హిట్ వచ్చిన తర్వాత ఏ హీరో సినిమా అయినా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతుంటారు. కానీ టాలీవుడ్ లో సీన్ రివర్స్ లో కనిపిస్తుంది. అందుకు కారణంగా మురగదాస్ పేరు హైలైట్ అవుతుంది.
ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ `మదరాసి` చిత్రం చేస్తోన్నసంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే మురగదాస్ బ్రాండ్ మాత్రం మార్కెట్ వర్కౌట్ అవ్వడం లేదు. వరుస పరాజయాలు మురగదాస్ కంటెంట్ పై ఎన్నో సందేహాలకు తావిచ్చినట్లు అయింది. మురగదాస్ గత చిత్రాలు `దర్బార్`, `సికిందర్` పరాజయం చెందిన సంగతి తెలి సిందే. ఇప్పుడా ప్లాప్ లే `మదరాసి`పై నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమా తెలుగు మార్కెట్ డల్ గా కనిపిస్తుంది. శివకార్తికేయన్ ఇమేజ్-మరగదాస్ గత సక్సెస్ ల కారణంగా తెలుగు డబ్బింగ్ రైట్స్ 14 కోట్లకు కోట్ చేయబడింది. కానీ సినిమాపై 7 కోట్లు కూడా పెట్టడం కూడా డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ గా భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఉందో? లేదో? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. `దర్బార్`, `సికిందర్` తరహాలో కంటెంట్ అయితే పంపిణీ దారుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈనేపథ్యంలో 7 కోట్లు కూడా రిస్క్ గా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
`అమరన్` లా శివ కార్తికేయన్ మ్యాజిక్ చేస్తాడా? అంటే ఇది బయోపిక్ కూడా కాదు. మురగదాస్ ని నమ్మడం ఎలా అంటున్నారు కొందరు. దీనికి తోడు స్టార్ డైరెక్టర్లు శంకర్, మణిరత్నం నుంచి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పంపిణీ దారులకు తీవ్ర నష్టాల్నే మిగిల్చినవే. దర్శకులపై నమ్మి ముందు కెళ్తే అరచేతిలో వైకుంఠం చూపించారు. మురగదాస్ కూడా ఇలాంటి షాక్ ఇస్తే పరిస్థితి ఏంటని తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది.