విడుదలపై క్లారిటీ లేని క్రేజీ సినిమాలు!

టాలీవుడ్‌లో సినిమాను ప్రకటించడం.. షూటింగ్ చేయడం ఒకెత్తయితే.. దానిని పక్కా ప్రణాళికతో థియేటర్లలోకి తీసుకురావడం మరొకెత్తుగా మారింది.

Update: 2026-05-28 14:30 GMT

టాలీవుడ్‌లో సినిమాను ప్రకటించడం.. షూటింగ్ చేయడం ఒకెత్తయితే.. దానిని పక్కా ప్రణాళికతో థియేటర్లలోకి తీసుకురావడం మరొకెత్తుగా మారింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ - ప్యాచ్ వర్క్, అలాగే ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నా? విడుదలకు నోచుకోకుండా సస్పెన్స్‌లో ఉన్న క్రేజీ చిత్రాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్లపై స్పష్టత లేకపోవడం ఇటు అభిమానులను అయోమయానికి గురిచేస్తుంటే అటు ట్రేడ్ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోట్ల రూపాయల బిజినెస్ ఈ సినిమాల పై ఆధారపడి ఉండటంతో ఈ ఆలస్యం పరిశ్రమపై ఒత్తిడిని పెంచుతోంది.

ఈ జాబితాలో అందరికంటే ముందుగా వినిపిస్తున్న పేరు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న‌ సోషియో ఫాంటసీ విజువల్ వండర్ `విశ్వంభర. `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మెగా అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. కానీ సినిమా విడుదల ఎప్పుడనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. భారీ వీఎఫ్ఎక్స్ పనులలో జ‌రుగుతోన్న‌ ఆలస్యం కార‌ణ‌మంటున్నారు. పాన్ ఇండ‌దియా సినిమాలు తీసిన రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్ సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఇంత స‌మ‌యం తీసుకోలేదు. కానీ వశిష్ట తీరు చూస్తుంటే? అంత‌కు మించే ప్లాన్ చేస్తున్నాడా? అన్న సందేహాలు లేక‌పోలేదు.

అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడిక్ వార్ డ్రామా `స్వయంభు` పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా కోసం నిఖిల్ గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ షెడ్యూల్స్ చాలా వరకు ముగిసి, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై క్లారిటీ లేదు. భారీ గ్రాఫిక్స్ -పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ప్రణాళికల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ క్యాలెండర్‌లో ముందుకు -వెనక్కి కదులుతోంది.

వీటితో పాటే ఇండస్ట్రీలో విభిన్నమైన కంటెంట్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న మరొక ప్రాజెక్ట్ `సంబరాల ఏటిగట్టు`. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా నిర్మాణం పరంగా ముగింపు దశకు చేరుకుందని సమాచారం. అయితే స్టార్ హీరోల చిత్రాల విడుద‌ల తేదీల‌ హడావుడి నడుమ ఈ సినిమాకి సరైన థియేట్రికల్ మార్కెట్ .. విడుదల సమయం దొరకడం కూడా సవాలుగా మారింది. సినిమా అవుట్‌పుట్ సిద్ధంగా ఉన్నా సరైన ప్రమోషన్ స్ట్రాటజీ , థియేటర్ల లభ్యత లేకపోవడం వల్ల ఈ సినిమా విడుదల తేదీ ఇంకా సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.

టాలీవుడ్‌లో ఇలాంటి క్రేజీ సినిమాల విడుదల వాయిదా పడటానికి లేదా తేదీలు ఖరారు కాకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, గ్రాఫిక్స్ , అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుండటం. రెండవది బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాలతో క్లాష్‌లను నివారించి సేఫ్ జోన్ చూసుకోవాలనే నిర్మాతల తాపత్రయం. మూడవది ఓటీటీ అగ్రిమెంట్లు .. శాటి లైట్ హక్కుల బిజినెస్ సమీకరణాలు కూడా థియేట్రికల్ రిలీజ్ విండోను నిర్ణయించడంలో ముఖ్య‌భూమిక‌ పోషిస్తున్నాయి.

చివ‌రిగా నిర్మాణం పూర్తయిన సినిమాలు ఎక్కువ కాలం ల్యాబ్‌లకే పరిమితమైతే నిర్మాతలపై వడ్డీల భారం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా సినిమాపై ఉండే పబ్లిక్ బజ్-క్రేజ్ కూడా కాలక్రమేణా తగ్గే ప్రమాదం ఉంది. `విశ్వంభర`, `స్వయంభు` వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లపై వీలైనంత త్వరగా విడుదల అయోమయం నుండి బయటపడి అధికారిక రిలీజ్ డేట్లను ప్రకటిస్తేనే ట్రేడ్ వర్గాలకు క్లారిటీ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రాల మేకర్స్ ఎలాంటి వ్యూహాలతో రంగంలోకి దిగుతారో? ఈ రిలీజ్ సంక్షోభానికి ఎలాంటి? ముగింపు పలుకుతారో చూడాలి.

Tags:    

Similar News