యువ నటి ప్రేమకథలో పెద్ద ట్విస్ట్.. హీరో కంట్రోల్ చేస్తున్నాడట!
సినీ పరిశ్రమలో కథానాయికల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.
సినీ పరిశ్రమలో కథానాయికల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ యువనటి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తనకు ఎట్టకేలకు మానసిక ప్రశాంతత లభించిందని...ఇకపై తాను ఎవరి అనుమతులూ తీసుకోవాల్సిన అవసరం లేదని..ఎవరికీ భయపడాల్సిన పని లేదని పేర్కొంటూ ..నేను నాకు నచ్చినట్టు మాట్లాడుతాను! అని ధైర్యంగా ప్రకటించింది. తనను ఏదో ఒక బంధం నిన్నటివరకు నియంత్రించిందని... దాని నుండి ఇప్పుడు విముక్తి లభించిందని.. సదరు యువనటి చేసిన క్రైప్టిక్ (నిగూఢమైన) పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ సందర్భంగా సదరు నటి స్పందిస్తూ.. ''కొన్నిసార్లు మనకు ఎదురయ్యే డెడ్ ఎండ్స్ (ముగింపులు) వదిలేస్తేనే ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజు ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ రోజు నుండి నేను నా స్వరాన్ని, నా జీవితాన్ని నేనే ఎంచుకుంటున్నాను. ఇకపై ఎవరి అనుమతులూ ఉండవు..ఎలాంటి భయాలూ ఉండవు. నాలోకి నేను తిరిగి ప్రయాణిస్తూ.. నాది అని నేను దాదాపు మర్చిపోయిన నా జీవితాన్ని మళ్లీ ప్రేమిస్తున్నాను. చాలా కాలంగా నేను చెప్పాలనుకుని... చెప్పడానికి అనుమతి లేని ఒక మాటను ఈ రోజు చెబుతున్నాను.. ఐ లవ్ యూ ఆల్'' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఒక యువ నటుడితో ఆ యువ నటి నడిపిన ప్రేమాయణంలో సదరు ప్రేమికుడు తనను తీవ్రంగా కంట్రోల్ చేశాడని అర్థమవుతోంది. ఇప్పుడు ఆ బంధనాల నుంచి బయటకు వచ్చేసింది ఆ యువనటి.
అలాగే కష్టసమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ``నాకు అండగా నిలిచినందుకు...నన్ను నమ్మినందుకు...నా జీవితాన్ని ఇంత ప్రేమతో నింపినందుకు థాంక్యూ. నాకు అత్యంత అవసరమైన సమయంలో మీ ప్రతి మెసేజ్ సానుకూల అండదండలు నన్ను చేరుకున్నాయి. నన్ను మళ్లీ నా దారిలోకి నడిపించినందుకు నమ్మినవారికి కృతజ్ఞతలు`` అని రాశారు. చివరగా...ఇది కోలుకునే సమయం అని.. స్వేచ్ఛ లభించిందని.. ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేని తన స్వీయజీవితం అంటూ ఆ యువనటి తన పోస్ట్‌ను ముగించారు.
సదరు యువ నటి గత కొంతకాలంగా ఒక స్టార్ హీరో కుమారుడితో ఘఢమైన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే సదరు హీరో కం ప్రేమికుడుఈ నటి సినిమా అవకాశాలను, సోషల్ మీడియా పోస్టులను, వ్యక్తిగత నిర్ణయాలను సైతం నియంత్రించడానికి ప్రయత్నించాడని... అందుకే ఈ బంధం నుండి బయటకు రావాలని ఈ నటి నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ బ్రేకప్ ట్విస్ట్ తర్వాతే ఈ యువనటి కెరీర్ పరంగా ..వ్యక్తిగతంగా కొత్త జోష్‌తో ముందడుగు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే... ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తదుపరి చిత్రంగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ కథానాయకుడు నటిస్తున్న ఈ చిత్రంలో ఒక పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుమ్ముతో కూడిన పల్లెటూరి దారిలో పట్టుచీరతో ఉట్టిపడే పల్లెటూరి అందంతో సదరు నటి ఆకట్టుకున్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న పాత్రలోను ఈ బ్యూటీ నటిస్తోంది. మోదుగ ఆకులతో విస్తరాకులు కుడుతూ జీవనం సాగించే అమ్మాయిగా మెప్పించనుంది.