డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పరారీ.. ఏం జరిగింది?
హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఆ కేసులో అతడు కీలక నిందితుడిగా వెలుగులోకి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.;
టాలీవుడ్ కు చెందిన ఓ నటి సోదరుడు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఆ కేసులో అతడు కీలక నిందితుడిగా వెలుగులోకి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసును ఈగల్ (EAGLE) టీమ్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. నిజానికి.. డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ లోని ట్రూప్ బజార్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ చేపట్టారు.
ఆ సమయంలో డ్రగ్స్ కొనుగోలు చేసే వారిలో అతడి పేరు బయటకు వచ్చింది. ఆ ఇద్దరు వ్యాపారుల నుంచి తరచుగా మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ట్రూప్ బజార్ కేంద్రంగా నడుస్తున్న భారీ డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ చాలా కాలంగా యాక్టివ్ గా ఉందని పోలీసులు వర్గాలు కొన్ని రోజులుగా చెబుతున్నాయి.
నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలు డ్రగ్స్ ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని, వారికి మరో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ అందిస్తున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ నలుగురి వివరాలను సేకరిస్తూ, సరఫరా చైన్ ను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. నటి సోదరుడి గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నారు.
గతేడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన మరో డ్రగ్స్ కేసులో అతడు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. అప్పట్లో కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకున్న సమయంలో పోలీసులు దాడి చేయగా, ఆ కేసులో అతని పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ కేసు పూర్తి వివరాలు బయటకు రాకముందే వ్యవహారం చల్లారిందని టాక్!
ఇప్పటి కేసులో మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారట. ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటి సోదరుడు పరారీలో ఉండటంతో, అతడి మొబైల్ కాల్ డేటా రికార్డులు, లావాదేవీల వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకు నటి సోదరుడు పారిపోయే అవకాశం ఉందని భావించి, అన్ని చెక్ పోస్టులకు అలర్ట్ జారీ చేసినట్లసు సమాచారం. అదే సమయంలో ఈ కేసు ద్వారా సినీ, వ్యాపార, హైప్రొఫైల్ వర్గాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి.. మరేం జరుగుతుందో..