మహిళల ఆందోళనను అవహేళన చేస్తారా?
దేశంలో మహిళల భద్రత, మానసిక ఆందోళనలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి.
దేశంలో మహిళల భద్రత, మానసిక ఆందోళనలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల బాలీవుడ్ నటి తిల్లోతమా షోమే మహిళల భద్రతపై వ్యక్తం చేసిన ఆందోళనపై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య తీవ్ర చర్చనీయాంశమైంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న భయాలు, ఆందోళనల గురించి తిల్లోతమా మాట్లాడగా వినియోగదారుడు ఆ భావాలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. దీనిపై స్పందించిన తిల్లోతమా ఆ నెటిజన్‌కు తనదైన శైలిలో ధీటైన కౌంటర్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే ఇటీవల దేశంలో మహిళలపై జరుగుతోన్న కొన్ని ఘటనలు, వారి భద్రతపై సమాజంలో నెలకొన్న ఆందోళనకర వాతావరణంపై తిల్లోతమా షోమే సోషల్ మీడియాలో స్పందించారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు లేదా రోజువారీ జీవితంలో వారి మనసులో కలిగే భయం, ఆందోళనల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతీ మహిళ స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించాల్సిన అవసరం ఉందని సున్నితమైన పోస్ట్ చేశారు.
అయితే మహిళల భద్రత వంటి ముఖ్యాంశంపై ఆమె చేసిన పోస్ట్‌ను ఒక నెటిజన్ అవహేళన చేసేలా కామెంట్ చేశాడు. తిలోతమా ఆందోళనను అసలు సమస్యగానే పరిగణించకుండా ఆమె మానసిక స్థితిని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మహిళల నిజమైన భయాలను, వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని చాలా తేలికగా కొట్టిపారేసే విధంగా ఆ కామెంట్ ఉంది. ఈ కామెంట్‌పై తిల్లోతమా షోమే తక్షణమే వ్యంగ్యంతో కూడిన కౌంటర్ ఇచ్చారు.
`ఎంత సున్నితమైన మనస్కుడవు నువ్వు అంటూ నెటిజన్ ఆటిట్యూడ్‌ను ఎండగట్టారు. మహిళలు ప్రతినిత్యం ఎదుర్కొనే అభద్రతా భావాన్ని, భయాలను అర్థం చేసుకోకపోగా వారి ఆందోళననే తప్పుపట్టే ధోరణి ఎంత దారుణమో అంటూ ఒక్క మాటతో స్పష్టం చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో మహిళల భద్రత ,సానుభూతి లేకపోవడంపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మహిళ భయాలను .. ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేసినప్పుడు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆందోళన ఎందుకు? అని ప్రశ్నించడం సరైన పద్ధతి కాదని పలువురు నెటిజన్లు తిల్లోతమాకు మద్దతుగా నిలిచారు.
సమాజంలో మహిళల భద్రత అనేది చర్చనీయాంశం మాత్రమే కాదు. అది వారు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న కఠిన వాస్తవమని ఈ ఘటన మరొకసారి నిరూపిస్తోంది. మహిళలు భయాలను, అభద్రతా భావాన్ని ధైర్యంగా వ్యక్తపరిచినప్పుడు హేళన చేయడం మానేసి వారి సమస్యల పట్ల సానుభూతితో, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం అందరిపై ఉంది. తిల్లోతమా షోమే వంటి నటీమణులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ధీటుగా ప్రశ్నించడం ద్వారా మహిళల స్వేచ్ఛ , భద్రత కోసం సమాజంలో మార్పు రావలసిన అవసరాన్ని మరొకసారి బలంగా గుర్తుచేశారు.