ఫ్లాపులొస్తున్నా రియల్ ఎస్టేట్‌లో సంపాదిస్తున్న నటుడు
ఇప్పుడు ఇదే జాబితాలో యువహీరో టైగర్ ష్రాఫ్ ముంబైలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో బాగానే ఆర్జిస్తున్నాడు.;
ముంబైలో రియల్ ఎస్టేట్ జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమితాబ్- అభిషేక్ బచ్చన్ జోడీ, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ కుటుంబం, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్, బోనీకపూర్- జాన్వీ- ఖుషీ త్రయం ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది బాలీవుడ్ స్టార్లు ముంబై బాంద్రాతో పాటు ఔటర్ లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతూ తెలివిగా ఆర్జిస్తున్నారు.
ఇప్పుడు ఇదే జాబితాలో యువహీరో టైగర్ ష్రాఫ్ ముంబైలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో బాగానే ఆర్జిస్తున్నాడు. అతడిని ఓవైపు వరుస ఫ్లాపులు నిరాశపరుస్తున్నా, రియల్ వెంచర్లలో పెట్టుబడి ఆదుకుంటోంది. ముంబై ఖార్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను అతడు 11.50 కోట్లకు కొనుగోలు చేసి ఆరేళ్లలోనే రూ. 15.60 కోట్లకు సేల్ చేయడం ఆసక్తిని కలిగించింది. కేవలం ఆరేళ్లలో 4 కోట్ల లాభం కళ్లజూసాడు. స్క్వేర్ యార్డ్స్ డాట్ కాం వివరాల ప్రకారం.. ఈ లావాదేవీ సెప్టెంబర్ 2025లో పూర్తయింది. టైగర్ ష్రాఫ్ విక్రయించిన అపార్ట్‌మెంట్ రుస్తోంజీ పారామౌంట్‌లో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ 1,989.72 చదరపు అడుగులు కార్పెట్ ఏరియా, 203.34 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా దీనికి అటాచ్ మెంట్ గా ఉన్నాయి. ష్రాఫ్ 2018లో రూ. 11.62 కోట్లకు ఈ ఆస్తిని కొనుగోలు చేశాడు.
ముంబై రియల్ ఎస్టేట్ లో ఖర్ ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఏరియాలో ప్రీమియం నివాసాలు, వాణిజ్య సముదాయాలతో చాలా పాపులరైంది. ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేసినా, వ్యాపారంలో తెలివైన పెట్టుబడి పెట్టినా పెద్ద స్థాయికి ఎదిగేందుకు ఛాన్సు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైల్, రోడ్ కమ్యూనికేషన్ ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్లస్. ఇక్కడ చాలా మంది అగ్ర నటులు రియల్ వెంచలర్లలో పెట్టుబడులు పెడుతున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే .. ఇటీవల కొన్నేళ్లుగా టైగర్ ష్రాఫ్ కి బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. అద్భుతమైన ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం, గొప్ప నటనా ప్రతిభ ఉన్నా కానీ ఇవేవీ అతడిని ఆదుకోవడం లేదు. హృతిక్ తో కలిసి నటించిన `వార్` చిత్రం తర్వాత టైగర్ కి ఒక్క హిట్టు కూడా లేదు. ఇటీవలే విడుదలైన భాఘి 4 కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో టైగర్ తీవ్ర నిరాశలో ఉన్నాడు.