కాజల్ 'ది ఇండియా స్టోరీ'.. కంచంలోకి స్లో పాయిజన్
మనం రోజూ తింటున్న ఆహారం అమృతమా లేక విషమా అనే ఒక భయంకరమైన ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ది ఇండియా స్టోరీ చిత్రం.
మనం రోజూ తింటున్న ఆహారం అమృతమా లేక విషమా అనే ఒక భయంకరమైన ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ది ఇండియా స్టోరీ చిత్రం. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఆహార కల్తీ అనే ఒక తీవ్రమైన జాతీయ సమస్యను ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడి ఉన్న పాయింట్ ను టచ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా టీజర్ చూస్తే మనం బ్రతకడానికి తింటున్నామా లేక రోగాల బారిన పడటానికి తింటున్నామా అనే భయం పుట్టడం ఖాయం. పుచ్చకాయలకు ఇంజెక్షన్లు ఇవ్వడం దగ్గరి నుంచి, దేశంలో 68 శాతం పాలల్లో డిటర్జెంట్, ఆయిల్, యూరియా కలుస్తున్నాయనే భయంకరమైన వాస్తవాలను టీజర్లో కుండబద్దలు కొట్టినట్లు చూపించారు. ఇది కేవలం సినిమా కోసమో లేక డ్రామా కోసమో రాసుకున్న ఫిక్షన్ కాదు, ప్రతి నిత్యం మనం ఎదుర్కొంటున్న స్లో పాయిజన్ లాంటి రియాలిటీ అని అర్ధమవుతుంది.
కల్తీ ఆహారం వల్ల దేశంలో క్యాన్సర్ మహమ్మారి ఎలా కోరలు చాచిందో లెక్కలతో సహా మేకర్స్ తెరపై చూపించిన విధానం నిజంగానే ఒక అలారం లాంటిది. ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ తో పోరాడుతున్నారని, ప్రతి 60 సెకన్లకు ఒకరు లేదా ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని టీజర్లో వెల్లడించిన గణాంకాలు భయపెడుతున్నాయి. ఏటా పది లక్షల మందికి పైగా ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న ఈ సైలెంట్ కిల్లర్ గురించి సామాన్యులను మేల్కొల్పే ప్రయత్నం ఈ సినిమాలో బలంగా కనిపిస్తోంది.
స్టార్స్ అనగానే సాధారణంగా రొటీన్ కమర్షియల్ కథలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్ ఇలాంటి ఒక సోషల్ అవేర్ నెస్ ఉన్న సబ్జెక్టును ఎంచుకోవడం మంచి నిర్ణయం. జీ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఎంఐజీ ప్రొడక్షన్స్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా ఇది దేశం మొత్తం ఎదుర్కొంటున్న ముప్పు కాబట్టి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు.
ఇదే ఏడాది జూలై 24న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు చేతన్ డీకే ఈ సీరియస్ సబ్జెక్టును స్క్రీన్ పై ఎంత రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రానికి సాగర్ బి షిండే నిర్మాతగా వ్యవహరిస్తూ స్వయంగా కథను అందించారు. ది ఇండియా స్టోరీ టీజర్ కేవలం సినిమా ప్రమోషన్ లా కాకుండా, వ్యవస్థ వైఫల్యాన్ని ప్రశ్నించే ఒక డాక్యుమెంటరీ తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రతి ఇంట్లో ఉండే వంటగదిలో జరుగుతున్న ఈ కల్తీ దందా వెనుక ఉన్న అసలు మాఫియాను సినిమాలో ఎలా చూపించబోతున్నారో చూడాలి.