ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తోందన్న డైరెక్టర్
ఇండిపెండెన్స్ డే ముందు కోల్‌కతాలో జరిగిన సంఘటనల ఆధారంగా వివేక్ ఈ సినిమాను రూపొందించారు.;
ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూ ఉంటారు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్ లాంటి వివాదాస్పద సినిమాలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా ది బెంగాల్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
బెంగాల్ ప్రభుత్వం మా సినిమాను అడ్డుకుంటుంది
ఇండిపెండెన్స్ డే ముందు కోల్‌కతాలో జరిగిన సంఘటనల ఆధారంగా వివేక్ ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా రిలీజ్ ను బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఈ విషయంలో న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ది బెంగాల్ ఫైల్స్ మూవీ విషయంలో పశ్చిమ బెంగాల్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు.
రిట్ పిటిషన్ వేస్తాం
బెంగాల్ గవర్నమెంట్ తమ సినిమా విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తుందని, అందుకే దీనిపై రిట్ పిటిషన్ వేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెందిన కొందరు ప్రతినిధులు థియేటర్ల ఓనర్లను బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ది బెంగాల్ ఫైల్స్ ను రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారని తమకు కొందరు ఓనర్లు చెప్పారన్నారు.
రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
సినిమాను రిలీజ్ చేస్తే నిజంగానే మా థియేటర్లను ఏమైనా చేస్తే ఏం చేయాలని థియేటర్ల ఓనర్లు తమను ప్రశ్నిస్తున్నారని, అందుకే ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్టు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. లక్షలాది మంది బెంగాలీ ప్రజలు ది బెంగాల్ ఫైల్స్ ను చూడాలనుకుంటున్నారని, ఈ సినిమా రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నిర్మాతల్లో ఒకరైన పల్లవి జోషి విజ్ఞప్తి చేశారు.