5 రోజుల్లో రిలీజ్.. ఇంకా సినిమాపై ఆగని కుట్రలు!
తాను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, రాజకీయ కక్షల్ని ఎదుర్కొని, ఎట్టకేలకు సినిమాని రిలీజ్ దశకు తీసుకు వచ్చాడు వివేక్ అగ్నిహోత్రి.;
తాను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, రాజకీయ కక్షల్ని ఎదుర్కొని, ఎట్టకేలకు సినిమాని రిలీజ్ దశకు తీసుకు వచ్చాడు వివేక్ అగ్నిహోత్రి. అతడు తెరకెక్కించిన 'ది బెంగాళ్ ఫైల్స్' సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, ఇంకా సీబీఎఫ్‌సి క్లియరెన్స్ ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ఈ సినిమాని వీక్షించి, కొన్ని కట్స్ సూచించినట్టు తెలుస్తోంది. హిజ్రాల గురించిన సెన్సిటివ్ వర్డ్ ని తొలగించాలని, కొన్ని సీన్లలో కొందరి ఫోటోలను తొలగించాలని కూడా సూచించినట్టు తెలిసింది.
అయితే ఇంకో ఐదురోజుల్లో తన సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఇంకా తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ కొందరు కుట్రకు పాల్పడ్డారని, తన సినిమా థీమ్ ని పోలి ఉండే బెంగాళ్ మారణ హోమానికి సంబంధించిన ఒక వీడియోని వివేక్ అగ్నిహోత్రి రిలీజ్ చేసారు. కొన్ని శక్తులు సినిమాను నిషేధించాలనుకుంటున్నాయి! అంటూ ఈ వీడియోను రిలీజ్ చేయడంతో దీనిపై చాలా చర్చ సాగుతోంది.
ది బెంగాల్ ఫైల్స్ చిత్రంలో రియలిస్టిక్ ఘటనలను ప్రదర్శిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో బెంగాల్ విభజన, ముస్లిమ్ లీగ్ అల్లర్లు, హిందువుల మారణ హోమం వంటి టాపిక్స్ వివాదాగ్నికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం బెంగాళ్ ని పాలిస్తున్న టీఎంసీకి చెందిన కొందరు నాయకులు వివేక్ అగ్నిహోత్రిపై పలు కేసులను ఫైల్ చేసారు. అతడిపై ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదయ్యాయి. అయినా మొండి పట్టుదలతో అగ్నిహోత్రి తన సినిమాని రిలీజ్ కి తెస్తున్నారు. సెన్సార్ ముంగిట ఈ సినిమా ఆపసోపాలు పడుతోంది. మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. కానీ ఇప్పటికీ రిలీజ్ పై క్లారిటీ రాకపోవడంతో మేకర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సినిమా నిడివి దాదాపు 204 నిమిషాలు. సుమారు 3గం.ల 24 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇది యానిమల్ కంటే ఒక నిమిషం అధిక నిడివి ఉన్న సినిమా అంటూ చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా కథను అగ్నిహోత్రి స్వయంగా రాసారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా, అభిషేక్ అగర్వాల్- పల్లవి జోషి నిర్మించారు. ఇందులో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ నటించారు.