పెళ్లయిన 26 ఏళ్ల తర్వాత విడాకుల కోరిన హీరో విజయ్ భార్య.. నిజమెంత?
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది.;
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దాదాపు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఆయన భార్య సంగీత విడాకులు కోరినట్లు వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చెంగల్‌పట్టు కోర్టులో పిటిషన్ దాఖలైందని, విజయ్‌కు నోటీసులు కూడా వెళ్లాయని జరుగుతున్న ప్రచారంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న తరుణంలో ఈ వార్త వెనుక ఉన్న అసలు నిజానిజాలేంటో అభిమానులు ఆరా తీస్తున్నారు..ఆ వివరాలు చూద్దాం..
అభిమానిగా వచ్చి.. అర్ధాంగిగా మారి:
విజయ్, సంగీతల ప్రేమకథ ఒక సినిమా స్టోరీని తలపిస్తుంది. 1996లో విజయ్ నటించిన ‘పూవే ఉనక్కాగా’ సినిమా చూసి ముగ్ధురాలైన సంగీత, లండన్ నుండి ప్రత్యేకంగా విజయ్‌ను అభినందించడానికి చెన్నై వచ్చారు. షూటింగ్ స్పాట్‌లో మొదలైన ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, 1999లో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఇక అప్పటి నుండి విజయ్ కెరీర్ ఎదుగుదలలో సంగీత కీలక పాత్ర పోషించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె ఎక్కడా కనిపించకపోవడం, చివరకు కోర్టు మెట్లు ఎక్కారనే వార్తలు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
కోర్టు నోటీసులు.. ఏప్రిల్‌లో విచారణ:
తాజా సమాచారం ప్రకారం, సంగీత తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక వివాహ బంధానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు అందులో ఉన్నాయని సమాచారం. గత ఏడాదే విడాకులు తీసుకుంటారనే రూమర్స్ వచ్చినా, అప్పట్లో వాటిని కేవలం ప్రచారంగానే కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు నేరుగా కోర్టు వ్యవహారమని వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది.
నిజమెంత? విజయ్ మౌనం వెనుక మర్మమేంటి:
అయితే ఈ వార్తలపై అటు విజయ్ టీమ్ నుండి కానీ, ఇటు సంగీత వైపు నుండి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అని సందేహిస్తున్నారు. ఇక పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్న కారణంగానే సంగీత అక్కడే ఉంటున్నారని విజయ్ సన్నిహిత వర్గాలు గతంలోనే స్పష్టం చేశాయి. ఏది ఏమైనా, ఏప్రిల్ 20న కోర్టు విచారణ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది తెలిస్తే తప్ప ఈ వివాదానికి ముగింపు పడేలా లేదు.