జననాయగన్.. వేసవికి వెళ్లబోతోందా?
సంక్రాంతికి తమిళనాడులోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా తమిళ సినిమాలు రిలీజయ్యే ప్రతిచోటా జననాగయన్ సందడి ఉంటుందని విజయ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.;
సంక్రాంతికి తమిళనాడులోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా తమిళ సినిమాలు రిలీజయ్యే ప్రతిచోటా జననాగయన్ సందడి ఉంటుందని విజయ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయ్ చివరి చిత్రం ఇదే కావడంతో థియేటర్లలో సంబరాలకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సినిమాకు బ్రేక్ పడిపోయింది. జనవరి 9న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యలు, కోర్టు గొడవలతో విడుదల ఆగిపోయింది.
శుక్రవారం ఉదయమే కోర్టు తీర్పు రావాల్సి ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఐతే ఈ రోజు ఉదయం జననాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ డివిజన్ బెంచ్ ఆదేశౄలివ్వడంతో జననాయగన్ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీకెండ్ కాకపోయినా.. వచ్చే వీకెండ్లో సినిమా రిలీజవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ సాయంత్రానికి మళ్లీ కథ మొదటికి వచ్చింది. సెన్సార్ బోర్డు అప్పీల్‌కు వెళ్లడంతో మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్.. జననాయగన్ టీంకు షాకిచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌పై స్టే విధించింది. ఈ నెల 21కు తదుపరి విచారణను వాయిదా వేసింది. అంటే తర్వాతి వారంలో కూడా సినిమా రిలీజ్ ఉండదని తేలిపోయింది. 21న కోర్టు విచారణ అంటే.. ఈ అనిశ్చితి మధ్య రిపబ్లిక్ డే వీకెండ్లో కూడా సినిమాను రిలీజ్ చేయడం కష్టమే అవుతుంది. రిపబ్లిక్ డే కలిసి రావాలంటే ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేయాలి. ఆలోపు కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని రిలీజ్‌కు ఏర్పాట్లు చేయడం కష్టమే. రిపబ్లిక్ డే వీకెండ్ మిస్ అయితే.. ఇక ఈ సినిమాను వేసవిలోనే చూడగలం.ఫిబ్రవరి సినిమాలకు అన్ సీజన్.
కాబట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను బట్టి వేసవి ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తారేమో. విజయ్ రాజకీయ అరంగేట్రం, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో చాలా పొలిటికల్ సీన్లు, డైలాగులు పెట్టారు. వాటి విషయంలోనే సెన్సార్ బోర్డు దగ్గర సమస్య తలెత్తింది. మరి ఈ సమస్యల మధ్య సినిమాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి. తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరి ఆధారంగా హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.