మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజీ లైన్అప్!
మెగా ఫ్యామిలీ హీరోల్లో రెగ్యులర్ పంథాకు పూర్తి భిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.;
మెగా ఫ్యామిలీ హీరోల్లో రెగ్యులర్ పంథాకు పూర్తి భిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కొత్త తరహా కథలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఆ పంథాలో కొన్ని సక్సెస్‌లని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మెగా హీరోలకు భిన్నంగా కొత్త తరహా కథలతో ప్రయాణం మొదలు పెట్టిన వరుణ్ తేజ్‌కు `గద్దలకొండ గణేష్` తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఈ మెగా హీరో హిట్టు మాట విని ఐదేళ్లకు పైనే అవుతోంది. కొత్త కథలని నమ్మి చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
కొత్త దర్శకుడితో చేసిన `గని`, ప్రవీణ్ సత్తారుని నమ్మి చేసిన `గాండీవధారి అర్జున`, బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హొడాకు అవకాశం ఇచ్చి భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో చేసిన `ఆపరేషన్ వాలెంటైన్` చేదు ఫలితాన్నిచ్చాయి. దీంతో కొత్త తరహా కథలని పక్కన పెట్టిన వరుణ్ కమర్షియల్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ఐదేళ్లుగా తనతో దోబూచులాడుతున్న సక్సెస్‌ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో కొత్త కొత్త కాంబినేషన్‌లని సెట్ చేసుకుంటున్నాడు. రానున్న రోజుల్లో క్రేజీ లైనప్‌తో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న కొరియన్ రీమేక్ థ్రిల్లర్ `కొరియన్ కనకరాజ`లో నటిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదొక హారర్ కామెడీ. రితికా నాయక్ హీరోయిన్. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూవీని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేఫథ్యంలో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టేస్తున్నాడు.
`ఆయ్` ఫేమ్ అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో ఓ సినిమాకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీన్ని పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై వరుణ్ సోదరి నిహారిక నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే స్టోరీ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. కథ లాక్ అయిపోయింది. ఉగాది సందర్భంగా దీన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అలాగే రవితేజతో `టచ్ చేసి చూడు` మూవీ చేసిన విక్రమ్ సిరికొండతో కూడా ఓ మూవీకి వరుణ్ కమిట్ అయినట్టుగా చెబుతున్నారు.
ఇవే కాకుండా వరుణ్ తేజ్ భారీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. `మట్కా`తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించి ఫెయిల్ కావడంతో ఈ సారి పక్కా ప్లాన్‌తో క్రేజీ డైరెక్టర్‌తో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందు కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీని ఎంచుకున్నాడని, ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.