అదే టెంప్లేట్! తలైవర్ 173 'బాషా' సీక్వెలా?
ఇంతలోనే 'తలైవర్ 173' కథాంశం గురించి కోలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బాషా (1995) కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. అది ఒక ప్రభంజనం. ఇండియన్ సినిమా చరిత్రలో 'మాస్ మసాలా' చిత్రాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన చిత్రమిది. సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'బాషా' విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4Kలో రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేయగా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కథాంశం, స్క్రీన్ ప్లే ఆ తర్వాత వచ్చిన చాలా బ్లాక్ బస్టర్ సినిమాలకు టెంప్లేట్ గా నిలిచింది. ఒక మధ్య తరగతి కుటుంబంలో సాధారణ యువకుడిగా కనిపించే కథానాయకుడు(రజనీ)కి ఒక గతం ఉంటుంది. అది భయానకమైనది. తన స్నేహితుడైన బాషాను దారుణంగా మట్టుబెట్టిన ప్రత్యర్థిని అంతమొందించేందుకు గ్యాంగ్ స్టర్ గా మారిన మాణిక్యం కథేమిటన్నదే ఈ సినిమా. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో ఈ సినిమాని రక్తి కట్టించిన తీరు ఆ తర్వాత టాలీవుడ్ లో తెరకెక్కిన సమర సింహారెడ్డి, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. బాషా ఆ రోజుల్లో 5 కోట్లతో తెరకెక్కి సుమారు 46 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో ఈ సినిమా ఒక ఏడాది పాటు (368 రోజులు) థియేటర్లలో ఆడింది.
అందుకే బాషా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కితే చూడాలని రజనీ అభిమానులు ఎప్పుడూ ఆశపడుతుంటారు. రజనీ నటించిన కొన్ని సినిమాలకు అదే టెంప్లేట్ వాడిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు మరోసారి రజనీకాంత్ బాషా టెంప్లేట్ తో 'తలైవర్ 173' తెరకెక్కనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలింస్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే దర్శకుడిని కూడా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. శివ కార్తికేయన్‌తో 'డాన్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సిబి చక్రవర్తి రజనీ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
ఇంతలోనే 'తలైవర్ 173' కథాంశం గురించి కోలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగుతుందని గుసగుస వినిపిస్తుంది. ఇందులో రజనీ డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో రక్తి కట్టిస్తారు. ఒక సాధారణ టైలర్ (దర్జీ)గా కనిపించే రజనీకి ఒక గతం ఉంటుంది. అది అత్యంత క్రూరమైనది. శత్రువులను వేటాడే సింహం అతడు. రజనీకాంత్ తన కుటుంబంతో శాంతియుత జీవితం గడిపేందుకు టైలర్‌గా మారతాడు. అయితే ఈ ప్రశాంతమైన జీవితం వెనుక, రహస్యంగా పాతిపెట్టిన ప్రమాదకర గతం ఆడియెన్ కి బిగ్ సర్ ప్రైజ్ గా ఉండనుంది. సమస్యలకు దూరంగా ఉండటానికి అతను ప్రయత్నించినా, ప్రమాదం చివరికి అతని జీవితంలోకి తిరిగి వస్తుంది. అదే క్రమంలో అతడు తన ఆత్మీయులను రక్షించుకోవడానికి చాలా కాలంగా అణచిపెట్టిన తన నిజ స్వరూపాన్ని తిరిగి చూపించాల్సి వస్తుంది. ఇది ఇంచుమించు బాషా తరహా టెంప్లేట్ లో సాగుతుందని చెబుతున్నారు.
ఈ తరహా కథాంశం రజనీని మరో లెవల్ లో ఆవిష్కరిస్తుంది. అది మాస్ ఫ్యాన్స్ కి కిక్కునిస్తుంది. అయితే దీనిపై దర్శకనిర్మాతలు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కానీ అందరి ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఇటీవల రిలీజ్ చేసిన 'పోస్టర్'లో టైలరింగ్ కత్తెరలు, పని ముట్లు, నకిలీ పాస్‌పోర్ట్‌ల వంటివి కనిపించాయి. ఇవి మాస్ యాక్షన్, హాస్యం, ఉత్కంఠను ఎలివేట్ చేస్తున్నాయి.
నిజానికి 'తలైవర్ 173' చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, ఆయన తప్పుకున్నారు. అటుపై పలువురు దర్శకులు రజనీకి కథలు వినిపించారు. అశ్వత్ మారిముత్తు, నితిలన్ స్వామినాథన్, రామ్‌కుమార్ బాలకృష్ణన్ సహా పలువురు కథలు వినిపించినా ఓకే కాలేదు. చివరికి ఈ ప్రాజెక్ట్ సిబి చక్రవర్తి చేతికి అందింది. అతడు ద్వితీయ ప్రయత్నమే రజనీని మెప్పించే కథను చెప్పారు.
సిబి చక్రవర్తితో సినిమా చేయడానికి ముందే, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2'లో రజనీ కనిపిస్తారు. ఈ చిత్రం 2023 బ్లాక్‌బస్టర్ జైలర్ చిత్రానికి సీక్వెల్. ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదల కానుంది.