విశ్వక్, రామ్, అబ్బవరం.. సరైన డెసిషన్ తీసుకున్నారా?

ఇటీవల కొందరు యంగ్ హీరోలు స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.

Update: 2026-06-16 17:54 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం కొత్త విషయం కాదు. గతంలో పలువురు నటులు మెగా ఫోన్ పట్టి తమ లక్ కు టెస్ట్ చేసుకున్నారు. అయితే అందరిదీ సక్సెస్ ఫుల్ జర్నీ కాలేదు. కథపై పట్టుతో పాటు దర్శకత్వంపై పూర్తి అవగాహన ఉంటేనే ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. లేకపోతే నటుడిగా, దర్శకుడిగా రెండింటిలోనూ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

ఇటీవల కొందరు యంగ్ హీరోలు స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. అందులో ముఖ్యంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం పేర్లు వినిపిస్తున్నాయి. వీరి నిర్ణయాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విశ్వక్ సేన్ ఇప్పటికే ఫలక్‌ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినప్పటికీ, భారీ కమర్షియల్ హిట్లుగా నిలవలేకపోయాయన్న విషయం తెలిసిందే. స్టోరీ, యాక్టింగ్, దర్శకత్వం బాధ్యతలన్నీ ఒకరే చూసుకోవడం వల్ల తగిన స్థాయిలో రిజల్ట్ రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక దాదాపు 20 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న రామ్ పోతినేని కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ గా డెబ్యూ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

అయితే ఇప్పటికే సరైన స్టోరీల సెలెక్షన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో, యాక్టింగ్ తోపాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం మరింత సవాల్‌ గా మారొచ్చని కొందరు ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కిరణ్ అబ్బవరం విషయంలోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. హీరోగా వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ నటుడిగా తన స్పెషాలిటీ గట్టిగా ప్రూవ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది.

అలాంటి స్టేజ్ లో దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం సరైన నిర్ణయమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల స్ట్రాంగ్ కథలు తగ్గిపోవడం, ఓటీటీ మార్కెట్‌ లో మార్పులు చోటుచేసుకోవడం, కంటెంట్ క్వాలిటీపై ప్రేక్షకుల అంచనాలు పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హీరోలు ఒకేసారి యాక్టింగ్, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తే ఏదో ఒక డిపార్ట్మెంట్ పై ఎఫెక్ట్ పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే క్రియేటివిటీ థింకింగ్ ఉన్న హీరోలు స్టోరీ రైటింగ్, స్క్రీన్‌ ప్లే డిజైనింగ్ విషయంలో ఇన్వాల్వ్ కావడం మంచిదేనని సినీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కానీ దర్శకత్వ బాధ్యతలను ఆ డిపార్ట్మెంట్ లో స్కిల్ ఉన్న డైరెక్టర్లకు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. టాలెంట్ పై నమ్మకం ఉండటం తప్పు కాదు. కానీ ప్రేక్షకుల అంచనాలు, మార్కెట్ పరిస్థితి, బాధ్యతల భారం అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News