నార్త్ మార్కెట్.. మేకర్స్ ప్లాన్ మారుతుందా? ఎఫెక్ట్ ఎంత?

తెలుగు సినిమా రేంజ్ రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో.. విదేశీ మార్కెట్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్ తెలుగు చిత్రాలకు కీలక రెవెన్యూ సోర్స్ గా మారింది.;

Update: 2026-04-09 00:30 GMT

తెలుగు సినిమా రేంజ్ రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో.. విదేశీ మార్కెట్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్ తెలుగు చిత్రాలకు కీలక రెవెన్యూ సోర్స్ గా మారింది. అయితే తాజాగా ఆ మార్కెట్‌ లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పెద్ద బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు దొరకడం కష్టమవుతోంది.

ఇప్పటి వరకు తెలుగు చిత్రాలు అమెరికాలో విడుదల కావడానికి స్థానిక డిస్ట్రిబ్యూటర్లపై నిర్మాతలు ఆధారపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నిర్మాతలు తమ సినిమాలను స్వయంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఓవర్సీస్ హక్కుల కోసం నిర్మాతలు కోరుతున్న భారీ ధరలే.

ప్రస్తుతం అమెరికా డిస్ట్రిబ్యూటర్లు రూ. 50 కోట్లకు పైబడిన డీల్ అంటే రిస్క్‌ గా భావిస్తున్నారట. అంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన తర్వాత, థియేటర్ల ద్వారా తిరిగి ఆ డబ్బును రికవర్ చేయడం చాలా కష్టంగా మారుతోందని టాక్ వినిపిస్తోంది. టికెట్ ధరలు, స్క్రీన్ల పరిమితి, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు.. అవన్నీ కలిపి రిస్క్‌ ను మరింత పెంచుతున్నాయట.

మరోవైపు.. రాబోయే కొన్ని భారీ తెలుగు సినిమాల మేకర్స్ ఓవర్సీస్ హక్కుల కోసం రూ. 100 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు మరింత ఆందోళన కలిగిస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని పెట్టి సినిమాను కొనుగోలు చేసి, లాభాలు పొందడం సాధ్యమా అన్న సందేహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో నిర్మాతలు కొత్త మార్గాల కోసం ఆలోచిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడకుండా, స్వయంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ ప్రమోషన్స్, డైరెక్ట్ థియేటర్ డీల్స్, లోకల్ పార్ట్నర్‌ షిప్స్ వంటి మార్గాల ద్వారా సినిమాను ప్రేక్షకులకు చేరవేయాలని చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీడియేటర్స్ ఖర్చు తగ్గుతుందని, లాభాలు నేరుగా వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

అయితే ఈ విధానం కూడా పూర్తిగా ఈజీ కాదు. విదేశీ మార్కెట్‌ లో రిలీజ్ చేయడం అనేది స్ట్రాటజీతో కూడుకున్న విషయం. స్థానిక మార్కెట్ ట్రెండ్, ప్రేక్షకుల అభిరుచులు, స్క్రీన్ మేనేజ్మెంట్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఆ విధానం ఇండస్ట్రీలో ఒక మార్పుకు నాంది కావచ్చు.

ఇకపై సినిమాల బడ్జెట్ మాత్రమే కాదు, వాటి బిజినెస్ స్ట్రాటజీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌ పై ఆధారపడకుండా, ఇతర ఆదాయ మార్గాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తానికి ఉత్తర అమెరికా మార్కెట్‌ లో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ తగ్గలేదని చెప్పాలి. కానీ ఆ మార్కెట్‌ లో వ్యాపారం చేసే విధానం మాత్రం మారుతోంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆ మార్పులు ఇండస్ట్రీపై ఎంతటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Tags:    

Similar News