సంక్షోభంలో టాలీవుడ్: 'పీపుల్స్ స్టార్' ఆవేదన వెన‌క‌ న‌గ్న స‌త్యం!

గతంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి దిగ్గజాలు ఏడాదికి డజన్ల కొద్దీ సినిమాలు చేస్తూ పరిశ్రమను పరుగులు పెట్టించేవారని నారాయణమూర్తి గుర్తు చేశారు.;

Update: 2026-05-05 06:16 GMT

తెలుగు చలనచిత్ర రంగం ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై ఆస్కార్‌ వంటి పురస్కారాలతో జైత్రయాత్ర సాగిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిష‌న్ రంగం, కార్మికుల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. ఇదే అంశంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఇటీవల వ్యక్తం చేసిన ఆవేదన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ `నిత్య కళ్యాణం పచ్చ తోరణం`లా విరాజిల్లాలని ఆకాంక్షించే పీపుల్స్ స్టార్ ప్రస్తుత స్తబ్దతపై ఘాటుగా స్పందించారు. 4 మే ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతి సంద‌ర్భంగా జ‌రిగిన వేడుక‌లో ఆయ‌న మాట‌ల సారాంశాన్ని డీకోడ్ చేస్తే దాని అర్థం ఇలా ఉంది.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి దిగ్గజాలు ఏడాదికి డజన్ల కొద్దీ సినిమాలు చేస్తూ పరిశ్రమను పరుగులు పెట్టించేవారని నారాయణమూర్తి గుర్తు చేశారు. అలాగే తన గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా నిరంతరం సినిమాలతో బిజీగా ఉండేవారని.. దానివల్ల వేలాది మంది సినీ కార్మికులకు చేతినిండా పని దొరికేదని ఆయన పేర్కొన్నారు. నేటి తరం హీరోలు కూడా అదే బాటలో పయనించి ఎక్కువ సినిమాల్లో నటించాలని..అప్పుడే పరిశ్రమ కళకళలాడుతుందని ఆయన హితవు పలికారు.

ప్రస్తుతం పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం `అథఃపాతాళానికి` పడిపోతోందనేది సీరియ‌స్ గా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా వేసవి సెలవుల వంటి కీలక సీజన్లలో గతంలో పెద్ద సినిమాలు క్యూ కట్టేవి. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క భారీ సినిమా కూడా కనిపించకపోవడంపై నారాయ‌ణ‌ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల కోసమే సినిమాలను దాచి ఉంచడం వల్ల.. ఏడాది పొడవునా పంపిణీ వ్యవస్థ స్తంభించిపోతోందని ఆయన విశ్లేషించారు.

ఈ భారీ బడ్జెట్ సినిమాల జాప్యం వల్ల కేవలం నిర్మాతలు మాత్రమే కాదు.. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఒక పెద్ద సినిమా కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం వల్ల మార్కెట్‌లో నగదు చలామణి తగ్గిపోతోంది. ఇది చిన్న సినిమాల మనుగడను కూడా దెబ్బతీస్తోంది. థియేటర్లు ఖాళీగా ఉండటం వల్ల ఎగ్జిబిషన్ రంగం కుప్పకూలి.. సింగిల్ స్క్రీన్లు మూతపడే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

సినిమా అంటే కేవలం గ్లామర్, అవార్డులు మాత్రమే కాదు.. అది కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం. కాబట్టి మేకర్స్ కేవలం పండుగలు, సీజన్ల మీదనే దృష్టి పెట్టకుండా క్రమం తప్పకుండా సినిమాలను విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అప్పుడే పరిశ్రమ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుంది. గ్లోబల్ గుర్తింపును ఆస్వాదిస్తూనే.. లోకల్ మార్కెట్‌ను, కార్మికుల సంక్షేమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అగ్ర హీరోలు, అగ్ర నిర్మాణ సంస్థలపై ఉందనేది నారాయణమూర్తి ప్రసంగం సారాంశం.

Tags:    

Similar News