వాంటెడ్: టాలీవుడ్ కి పాన్ ఇండియా రైటర్లు !
| తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్నా, కొత్త కథలు అందించే రచయితల కొరత కనిపిస్తోంది. రొటీన్ మాస్ కథలకు స్వస్తి పలికి, యూనివర్సల్ ఎమోషన్స్, కొత్త కాన్సెప్ట్స్‌తో కథలు రాసే రైటర్లను ప్రోత్సహించాలని ఇండస్ట్రీకి సూచనలు వినిపిస్తున్నాయి. బలమైన కథలే తెలుగు సినిమా తదుపరి విజయాలకు పునాది కానున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతున్న వేళ ఇండస్ట్రీలో అత్యంత కీలకంగా మారిన అంశం రైటింగ్. బడ్జెట్‌లు వందల కోట్లకు చేరాయి. టెక్నాలజీ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. స్టార్ హీరోల మార్కెట్ విస్తరించింది. కానీ ఈ భారీ హంగులన్నింటినీ నిలబెట్టే బలమైన కథ.. కొత్త ఆలోచనలు అందించే పాన్ ఇండియా రైటర్ల కొరత కనిపిస్తోందన్నది కాదనలేని నిజం.
గతంలో రొటీన్ ఫార్ములాలు.. పాత టెంప్లేట్లతో సినిమాలు తీస్తే ప్రాంతీయంగా నడిచిపోయేవి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా.. అంతర్జాతీయంగా ప్రేక్షకులు ఒకేసారి సినిమాను చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అందరినీ కట్టిపడేసే యూనివర్సల్ ఎమోషన్.. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే కథాంశం ఉంటేనే సినిమా నిలబడుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక పరిమితులను దాటి దేశం మొత్తం కనెక్ట్ అయ్యేలా ఆలోచించగల రచయితల అవసరం అనివార్యమైంది.
ఒకే రకమైన మాస్ మసాలా.. పాత ప్రతీకార కథలతోనే చాలామంది రైటర్లు లాక్కొస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం కొత్తదనం కోసం తపిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌లు.. ఊహించని మలుపులు.. లోతైన పాత్రలు రాసే దమ్మున్న రచయిత వస్తే ఆ కథకు తిరుగుండదు. నిజమైన కొత్త ఆలోచన ఉన్నవాడికి ఇండస్ట్రీలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అతని ముందు ఏ అడ్డంకీ నిలబడదు.
దర్శక, నిర్మాతలు కూడా ఈ విషయాన్ని లోతుగా గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. స్టార్ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలను వంచడం కాకుండా బలమైన రైటింగ్ టీమ్‌లను పెట్టుకుని కథను ముందుగా పక్కాగా సిద్ధం చేసుకోవాలి. బయటి భాషల నుంచి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన రచయితలను కూడా తెలుగు పరిశ్రమ ఆహ్వానించాలి.
ఇప్పటికే కొందరు యువ దర్శక, రచయితలు కొత్త పంథాలో వెళ్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ ధోరణి ఇంకా విస్తరించాలి. మూస ధోరణిని బ్రేక్ చేసే కొత్త కోణాలు.. మన పురాణాలు.. చరిత్ర .. సైన్స్ ఫిక్షన్.. థ్రిల్లర్ ఇలా ఏ జోనర్ అయినా? దానిని పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తికరంగా చెప్పే నైపుణ్యం ఉన్నవాళ్లే రేపటి విజేతలు అవుతారు.
టాలీవుడ్ పాన్ ఇండియా ప్రయాణాన్ని మరింత బలపరుచుకోవాలంటే? నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు రచయితల స్థాయి కూడా పెరగాలి. పాత చింతకాయ పచ్చడి కథలను పక్కన పెట్టి కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని చుట్టేసే సత్తా ఉన్న రైటర్లకు పెద్దపీట వేస్తే తెలుగు సినిమాకు తిరుగుండదు.