విదేశీ బ్యానర్లు భారతదేశంలో సినిమాలు తీస్తే రాయితీ ఎంతో తెలుసా?
| భారత్‌లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేసే అంతర్జాతీయ సినిమా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 30 నుంచి 40 శాతం వరకు నగదు రాయితీ అందిస్తోంది. భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం, దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు. ఈ పథకం హైదరాబాద్‌కు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వ రాయితీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
విదేశీయులు భారతదేశంలో సినిమాలు తీస్తే, మన లొకేషన్లు విస్త్రతంగా కవర్ చేస్తే.. భారతదేశ టూరిజానికి అది భారీ ఆదాయాన్ని తెస్తుంది. అందుకే విదేశీ నిర్మాణ సంస్థలను భారతదేశం వైపు ఆకర్షించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్-ఎఫ్.ఎఫ్.వో -నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ కలిసి అత్యంత ఆకర్షణీయమైన ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. భారత్‌లో షూటింగ్ చేయడానికి.. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చేయించుకోవడానికి వచ్చే అంతర్జాతీయ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం నుండి గరిష్టంగా 40శాతం వరకు నేరుగా క్యాష్ రీయింబర్స్‌మెంట్ (నగదు రాయితీ) అందిస్తోంది.
రాయితీల శాతం ఎలా లెక్కిస్తారు అనే వివరాలు పరిశీలిస్తే.. భారత్‌లో షూటింగ్ - పోస్ట్-ప్రొడక్షన్ కోసం విదేశీ నిర్మాత చేసే క్వాలిఫైడ్ ప్రొడక్షన్ ఎక్స్ పెండిచర్ (క్యూపీఈ) పై 30శాతం రాయితీ లభిస్తుంది. దీని గరిష్ట పరిమితి 30 కోట్లు (సుమారు 3.6 మిలియన్ డాలర్లు) వరకు ఉంటుంది. ఒకవేళ ఆ సినిమాలో భారతీయ సంస్కృతి, పర్యాటక ప్రాంతాల ప్రమోషన్‌కు ప్రాధాన్యత ఇచ్చినా లేదా కనీసం 15 శాతం కంటే ఎక్కువ మంది భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకున్నా అదనంగా 5 శాతం చొప్పున మొత్తం 10 శాతం వరకు బోనస్ లభిస్తుంది. అంటే మొత్తం రాయితీ 40 శాతం వరకు చేరుతుంది.
ఈ రాయితీ పొందడానికి ప్రధాన నిబంధనలు పరిశీలిస్తే...కేంద్ర ప్రభుత్వ ఇన్సెంటివ్‌కు అర్హత సాధించాలంటే విదేశీ నిర్మాణ సంస్థలు కొన్ని కచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఫీచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, యానిమేషన్ , వీఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు (ఒకే దేశంతో తీసేవి లేదా భారతీయ నిర్మాతలతో కలిసి చేసే కో-ప్రొడక్షన్లు) ఈ పథకానికి అర్హులు.
భారత్‌లో షూటింగ్ ప్రారంభించడానికి ముందే కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ ఎం.ఐ.బి-ఎఫ్.ఎఫ్.వో పోర్టల్ ద్వారా అధికారిక షూటింగ్ అనుమతి పొంది ఉండాలి. అలాగే భారత్‌లో కనీస స్థాయిలో షూటింగ్ రోజులు పూర్తి చేయడంతో పాటు.. బడ్జెట్లో ఒక నిర్ధేశించిన కనీస మొత్తాన్ని ఇక్కడ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
విదేశీ నిర్మాత తప్పనిసరిగా భారతదేశంలో రిజిస్టరై ఉన్న ఒక లైన్ ప్రొడ్యూసర్ లేదా సహ-నిర్మాణ సంస్థ ద్వారా వ్యవహారాలు నడపాలి. భారత్‌లో చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించి జీఎస్‌టీ బిల్లులు, చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ధృవీకరించిన ఆడిట్ రిపోర్టులను సమర్పించాలి. స్క్రిప్ట్ అనుమతి తీసుకున్న విధానానికి కట్టుబడి ఉండాలి. సున్నితమైన లేదా నిషేధిత ప్రాంతాల్లో అనుమతి లేకుండా చిత్రీకరణ జరపకూడదు. నిబంధనలను తప్పక ఉల్లంఘించకూడదు.
హైదరాబాద్ కు ప్రయోజనం ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ 40 శాతం వరకు రాయితీకి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో 15-20 శాతం రాష్ట్ర రాయితీని (స్టూడియో అద్దెలు, స్థానిక ఖర్చులపై) జత చేస్తుందనే ప్రచారం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిపుణులైన వీఎఫ్ఎక్స్ స్టూడియోలు హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నందున.. ఈ కేంద్ర-రాష్ట్ర సంయుక్త విధానం అమలైతే హాలీవుడ్ ప్రాజెక్టులు నేరుగా హైదరాబాద్‌కు క్యూ కట్టే అవకాశం ఉంది. అయితే టీఎస్ ప్రభుత్వ రాయితీలపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.