టాలీవుడ్ పరిశ్రమలో పెరుగుతోన్న సహజ నటుల ప్రాధాన్యత!
| గ్లామర్, స్టార్ ఇమేజ్ కంటే సహజ నటనకు టాలీవుడ్ మేకర్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సముద్రఖని వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలు పెరుగుతున్నాయి. పాత్రకు తగ్గ నటీనటుల ఎంపికతో సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేస్తున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే గ్లామర్.. ఆడంబరాలు.. భారీ సెట్టింగులే ప్రధాన ఆకర్షణగా ఉండేవి. కథానాయికల ఎంపిక నుంచి కీలక పాత్రల వరకు బ్యూటీ.. స్టార్ ఇమేజ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ప్రేక్షకుల అభిరుచి మారడంతో తెరపై కృత్రిమత్వాన్ని కాకుండా నేచురల్ పర్పార్మెన్స ఇచ్చే ఆర్టిస్టుల వైపే దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
హీరోయిన్ల విషయంలో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో గ్లామర్ కోసమో? పాటల కోసమో? ఉత్తరాది భామలను తీసుకొచ్చే సంప్రదాయం ఉండేది. అయితే భాష రాకపోవడం వల్ల ఎమోషనల్ సన్నివేశాల్లో సరైన హావభావాలు పలికించలేకపోతున్నారనే విమర్శలు వచ్చేవి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్, సంయుక్తా మీనన్, నివేదా థామస్ వంటి దక్షిణాది నటీమణులకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది.
బలమున్న పాత్రలు రాసుకుంటున్న దర్శకులు ఆ పాత్రలకు ప్రాణం పోసే నటీమణులనే ఎంచుకుంటున్నారు. సొంతంగా డబ్బింగ్ చెప్పించి.. మన సంస్కృతికి.. నేటివిటీకి దగ్గరగా ఉండే దక్షిణాది భామలైతే ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. అందం మాత్రమే కాకుండా కళ్లతోనే భావాలను పలికించగల నేచురల్ పెర్ఫార్మర్స్ కోసం వేట జోరుగా సాగిస్తున్నారు.
హీరోయిన్ల విషయంలోనే కాదు. సినిమాలో కీలక మలుపులు తిప్పే సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల విషయంలోనూ టాలీవుడ్ సరికొత్త దారిలో వెళ్తోంది. గతంలో హిందీ నటులను విలన్లుగా తీసుకొచ్చి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించేవారు. కానీ ఇప్పుడు సహజత్వం కోసం తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టులను తెలుగులోకి తీసుకొస్తున్నారు.
ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, రోషన్ మాథ్యూ, కిషోర్ వంటి నటులు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. వీరి నటనలో ఉండే సహజత్వం సన్నివేశాల స్థాయిని అమాంతం పెంచేస్తోంది. స్టార్ హీరోల సినిమాలైనా? చిన్న బడ్జెట్ చిత్రాలైనా? కథకు తగ్గ నటులుంటేనే ఆ సినిమాకు నిండుదనం వస్తుందని దర్శకులు భావిస్తున్నారు.
ఓటీటీ వేదికల రాకతో ప్రపంచ సినిమాను చూస్తున్న తెలుగు ప్రేక్షకులను మెప్పించాలంటే నటనలో నిజాయతీ ఉండాలని ఇండస్ట్రీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా పాత్రలో ఒదిగిపోయే సహజ నటులకు టాలీవుడ్‌లో డిమాండ్ అంతకంతకు పెరుగుతోందన్నది పచ్చి నిజం.