మారిన ట్రెండ్: టాలీవుడ్‌కు ఇప్పుడు కావాలి నోలాన్‌లు, సింగీతంలు!
వాస్తవానికి లెజెండరీ సింగీతం శ్రీనివాసరావులా సరికొత్తగా, వినూత్నంగా ఆలోచించే దర్శకులు టాలీవుడ్‌లో మళ్లీ పుట్టలేదు అనేదే చేదు నిజం.
కమర్షియల్ ఫార్ములా చిత్రాలతో టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా.. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచి - ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం పాటలు, ఫైట్లు, సెంటిమెంట్‌తో సినిమాలు నడిచేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో గ్లోబల్ కంటెంట్‌ను చూస్తున్న ప్రేక్షకులను మెప్పించాలంటే టాలీవుడ్‌కు ఇప్పుడు హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ లాంటి విలక్షణ ఆలోచనలు, మన టాలీవుడ్ గర్వించదగ్గ మైండ్ బ్లోయింగ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లాంటి ప్రయోగాత్మక దృక్పథం ఉన్న దర్శకులు ఎంతో అవసరం.
వాస్తవానికి లెజెండరీ సింగీతం శ్రీనివాసరావులా సరికొత్తగా, వినూత్నంగా ఆలోచించే దర్శకులు టాలీవుడ్‌లో మళ్లీ పుట్టలేదు అనేదే చేదు నిజం. ఆ రోజుల్లోనే ఆయన తెరకెక్కించిన ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం వంటి చిత్రాలు సినిమా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచాయి. మాటలు లేని మూగచిత్రంగా `పుష్పక విమానం` తీసినా, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో `ఆదిత్య 369` అద్భుతాన్ని సృష్టించినా అది కేవలం సింగీతం గారికే సాధ్యమైంది. ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఒక ప్రయోగమే. దురదృష్టవశాత్తూ ఆయన తర్వాత ఆ రేంజ్‌లో ఫిక్షనల్ థింకింగ్ (కల్పిత కథల విశ్లేషణ) చేసిన దర్శకులు మనకు చాలా కాలం వరకు కరువయ్యారు.
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిక్షన్ -సైన్స్ ఫిక్షన్ చిత్రాల హవా విపరీతంగా పెరిగింది. నేటి తరం దర్శకులు స్పై థ్రిల్లర్లు, హారర్ థ్రిల్లర్ల వైపు పరుగులు తీస్తూ భారీ వసూళ్లను సాధించే ఫార్ములా కోసం వెతుకుతున్నారు. కానీ ఈ కమర్షియల్ ఫార్ములాకు ధీటుగా సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ కథలతోనే బాక్సాఫీస్‌ను కొల్లగొట్టవచ్చని సింగీతం ఆ కాలంలోనే నిరూపించారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు గ్రాఫిక్స్ (VFX) బేస్డ్ ఇమాజినేషన్‌తో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు కానీ.. ఒక అద్భుతమైన ఫిక్షన్ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎలా వండి వార్చాలో ప్రూవ్ చేయలేకపోయారు. కేవలం విజువల్స్ మీదే శ్రద్ధ పెట్టారు తప్ప, సింగీతం లాంటి పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌లను రాయలేకపోయారు.
అయితే చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తూ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ `మనం`, సూర్యతో చేసిన `24` లాంటి చిత్రాలతో ఫిక్షన్ స్టోరీలతో కొంత మ్యాజిక్ చేయగలిగారు. ముఖ్యంగా 24 లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను డీల్ చేసిన విధానం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మళ్లీ అంతటి భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సింగీతం సృష్టించిన లెగసీలా ఆలోచించిన ఏకైక దర్శకుడిగా నాగ్ అశ్విన్ మాత్రమే మనకు కనిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ సింగీతం స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్‌కు మన పురాణాలను ముడిపెడుతూ ఆలోచించారు కాబట్టే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే విప్లవాత్మక చిత్రంగా నిలిచిన `కల్కి 2898 ఏడి` పుట్టింది.
ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరిన తరుణంలో మరికొందరు దర్శకులు కూడా ఈ ఫిక్షన్ -సైన్స్ ఫిక్షన్ జోనర్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు అట్లీ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ రాకా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` తో సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయాన్ని చూశాక.. అట్లీ సైతం ఈ సరికొత్త ఫిక్షన్ ప్రపంచంలో తన మార్క్ ఏంటో నిరూపించుకోవాల్సిన కచ్చితమైన పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగాలన్నా.. తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికలపై మెరవాలన్నా.. మన పరిశ్రమకు మరికొంత మంది నోలాన్‌లు, సింగీతంలు అత్యవసరంగా కావాలి! అవెంజర్స్, స్పైడర్ మేన్, బ్లాక్ పాంథర్, యాంట్ మేన్, ఇన్సెప్షన్, ఓపెన్ హీమర్, గ్లాడియేటర్, ట్రాయ్ .. వీటన్నిటినీ మించేలా మన వాళ్లే తీయాలి!!