తెలుగమ్మాయిలకు ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల సెగ
ఈరోజుల్లో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చాలా విషయాలను శాసిస్తున్న సంగతి తెలిసిందే.;
ఈరోజుల్లో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చాలా విషయాలను శాసిస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఎంతగా ఫాలోవర్స్ ఉంటే, అంతగా ప్రభావశీలురుగా పరిగణిస్తున్నారు. లైక్ లు క్లిక్ లు ప్రతిదీ డిసైడ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాల్లో సరైన అనుచరులు లేకపోతే ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను కూడా లైట్ తీస్కుంటున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఇంతకుముందు ప్రముఖ బాలీవుడ్ నటి ఒకరు తాను ఇండస్ట్రీలో ఏళ్లుగా నటనలో రాణిస్తున్నా, దశాబ్ధాల తర్వాత తనకు సోషల్ మీడియాల్లో అనుచరులు లేరనే మిషతో దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే ఆమె ఫేడవుల్ అయ్యిందిలే! అని తీసి పారేయడానికి లేదు. అందగత్తె అయి ఉండీ, ప్రతిభావనిగా నిరూపించుకుని కూడా ఇప్పుడు అవకాశాల్లేక విలవిలలాడుతోంది. కనీస ఉపాధి లేక ధీన స్థితిలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ బెగ్ చేయాల్సి వస్తోంది. ఆ నటి ఎవరు? అనేది అప్రస్తుతం. డిజిటల్ మీడియా ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.
ఇప్పుడు ఈ సెగ్ తెలుగమ్మాయిలను కూడా తాకుతోంది. ఇటీవలి కాలంలో తెలుగమ్మాయిలు రంగుల ప్రపంచంలో అద్భుతంగా రాణిస్తున్నారు. కేవలం తెలుగు సినీపరిశ్రమలోనే కాదు, ఇరుగు పొరుగు భాషల్లోకి దూసుకెళుతున్నారు. పలువురు తెలుగమ్మాయిలు తమిళ చిత్రసీమతో పాటు బాలీవుడ్ లోను నిరూపించుకున్నారు. కన్నడం, మలయాళంలోను నటిస్తున్నారు. ఇదే సమయంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్! అని బతిమాలుకోవాల్సిన పరిస్థితిలో కొందరు ఉన్నారు.
ఇటీవల ఓ రైజింగ్ తెలుగు నటి తమ అవకాశాల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు కొట్టేస్తున్నారని, వారిలో అంతగా ఎక్స్ ప్రెషన్స్ లేకపోయినా, సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి దర్శకనిర్మాతలు అవకాశాలు కల్పిస్తున్నారని అరోపించింది. కేవలం సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్, లైక్ లు క్లిక్ లు చూస్తున్నారు. థియేటర్ ఆర్టిస్టా? మంచి ప్రతిభ ఉందా లేదా? అనేది కూడా పట్టించుకోవడం లేదని దర్శకనిర్మాతలను విమర్శించింది. అంతేకాదు ఇలాంటి వారికి ఆన్ లొకేషన్ ప్రతిదీ నేర్పించాల్సి ఉంటుందని కూడా సదరు నటీమణి వ్యాఖ్యానించింది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టులుగా ఉన్న క్యారెక్టర్ నటీమణులు కూడా ఎక్కువగా ఆరోపిస్తున్నది ఇన్ ఫ్ల్యూయెన్సర్ల గురించే. అయితే వారిలో ప్రతిభ లేకపోతే ఇన్ ఫ్లూయెన్సర్లకు దర్శకులు అవకాశాలు కల్పిస్తారా? అనేదే అసలు ప్రశ్న. అయితే చాలా మంది నటీమణులు సినీరంగంలో ప్రవేశించి కొన్నేళ్ల పాటు ఈ రంగంలో కొనసాగిన తర్వాతే నేర్చుకున్నారనేది కాదనలేని వాస్తవం. దీనికి అనుష్క ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబి డియోల్ 40 సంవత్సరాల తర్వాత నటనలో వర్క్ షాపుల్లో పాల్గొని నేర్చుకున్నాడని అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకనిర్మాత చెప్పారు. దీనిని బట్టి చాలా మంది నటనను ఆరంభ దశలో మ్యానేజ్ చేస్తున్నారని అంగీకరించక తప్పదు.