RRR తరువాత ఎన్ని థియేటర్స్ మూతపడ్డాయంటే..

తెలంగాణ సినీ పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Update: 2026-05-13 05:19 GMT

తెలంగాణ సినీ పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మారుతున్న కాలంలో ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీల ప్రభావం వల్ల థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి.

వ్యవస్థను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 'RRR' సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నైజాం ఏరియాలో దాదాపు 100 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయని శిరీష్ రెడ్డి వెల్లడించారు. ఇది చాలా సీరియస్ విషయమని, కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇన్ని థియేటర్లు ప్యాకప్ చెప్పడం ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో ముంబై వంటి నగరాల్లో ఇలాగే థియేటర్లు మూతపడ్డాయని, ఇప్పుడు అదే పరిస్థితి హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వ్యక్తిగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలో చాలా మందికి అసలు ఎన్ని థియేటర్లు మూతపడ్డాయో, ఏ ఏ ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదని శిరీష్ రెడ్డి అన్నారు.

ఇండస్ట్రీ ఏ దిశగా వెళ్తుందో తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారని, కానీ వ్యవస్థను నమ్ముకున్న వారు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాది కాలంలో మరిన్ని థియేటర్లు మల్టీప్లెక్స్ లుగా మారిపోవడం లేదా పూర్తిగా మూతపడటం ఖాయమని అన్నారు. ఎగ్జిబిటర్ల మనుగడ సాగాలంటే పర్సంటేజీ షేరింగ్ వంటి కొత్త విధానాలను అమలు చేయడం తప్పనిసరి అని డిమాండ్ చేశారు.

సినిమా అంటే కేవలం హీరోలు, నిర్మాతలు మాత్రమే కాదని, థియేటర్ యజమానులు కూడా అందులో అంతర్భాగమని శిరీష్ రెడ్డి గుర్తు చేశారు. అందరికీ తమ హక్కుల గురించి అడిగే అధికారం ఉన్నప్పుడు, కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టిన ఎగ్జిబిటర్లకు కూడా తమ వాటా అడిగే హక్కు ఉంటుందని ప్రశ్నించారు. కేవలం పెద్ద సినిమాల వసూళ్ల గురించి కాకుండా, థియేటర్ల మనుగడ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన సూచించారు.

పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే సింగిల్ స్క్రీన్లను కాపాడుకోగలమని ఆయన తెలిపారు. ఇక శిరీష్ రెడ్డి చేసిన ఈ హెచ్చరికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 100 థియేటర్లు మూతపడటం అనేది సామాన్యమైన విషయం కాదని, దీనిపై నిర్మాతలు, హీరోలు కూడా సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. వ్యవస్థను కాపాడుకోవాలంటే మార్పులు అవసరమని, లేదంటే భవిష్యత్తులో కేవలం మల్టీప్లెక్స్ లలోనే సినిమాలు చూసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు చేస్తున్న ఈ పోరాటం చివరకు ఎలాంటి పరిష్కారానికి దారితీస్తుందో వేచి చూడాలి.




Tags:    

Similar News