హైదరాబాద్‌లో పూణే తరహా ఫిలిం ఇనిస్టిట్యూట్?
ఇక ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి యువతరంలో స్కిల్‌ని పెంపొందించేందుకు ఏం చేయాలో చెప్పుకొచ్చారు. అన్ని శాఖల్లోను వృత్తిగత నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేకించి శిక్షణ అవసరం అని అన్నారు.;
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈసారి సమావేశాలలో ఆనంద్ మహీంద్రా- మెగాస్టార్ చిరంజీవి తదితరులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అద్భుతమైన స్పీచ్ లు ఇచ్చారు.
యువతరంలో స్కిల్ ని పెంపొందించాలనే తపన పెద్దలలో స్పష్ఠంగా కనిపించింది. ముఖ్యంగా మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్రా వినోదరంగంపై ఆసక్తిని కనబరచడం, ఈ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించడం ఆసక్తిని కలిగించింది. 5- 10ని.ల నిడివి ఉన్న లఘుచిత్రాలను రూపొందించే ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఒక వేదికను క్రియేట్ చేస్తానని ఆయన ప్రామిస్ చేసారు. అలాగే వినోదరంగ ప్రముఖుడైన మెగాస్టార్ చిరంజీవిని లెజెండ్ అంటూ పొగిడేసారు మహీంద్రా. చిరును కలవడం ప్రత్యేకంగా ఉందని, ఎట్టకేలకు కలవగలిగానని ఆనందం వ్యక్తం చేసారు.
ఇక ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి యువతరంలో స్కిల్‌ని పెంపొందించేందుకు ఏం చేయాలో చెప్పుకొచ్చారు. అన్ని శాఖల్లోను వృత్తిగత నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేకించి శిక్షణ అవసరం అని అన్నారు. అదే సమయంలో ప్రతిభను సానబట్టేందుకు ప్రత్యేకించి శిక్షణ కల్పించే ఇనిస్టిట్యూట్ కావాలని కూడా సూచించారు. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరు సూచనను పరిగణించారు.
తాజా సమాచారం మేరకు... హైదరాబాద్ కేంద్రంగా పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీపరిశ్రమ తరపున దిల్ రాజు ఎఫ్.డి.సి ఛైర్మన్ హోదాలో పరిశ్రమ అభివృద్ధికి నైపుణ్య శిక్షణ కోసం ఒక ఫిలింఇనిస్టిట్యూట్ ప్రభుత్వం తరపున ఉండాలని సీఎం రేవంత్ కి సూచించారని కూడా గుసగుస వినిపిస్తోంది. వేదికపై చిరంజీవి దీనిని గుర్తు చేసారు.. పలువురు సినీపెద్దల నుంచి కూడా రేవంత్ కి ఈ సూచన అందిందని తెలుస్తోంది.
నిజానికి సౌత్ ట్యాలెంట్ బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్నా, ఇంకా పూణే ఫిలింఇనిస్టిట్యూట్ లో చదివాడు! అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దక్షిణాదిన ప్రభుత్వం తరపున అలాంటి ఇనిస్టిట్యూట్ ఏదీ లేకపోవడమే దీనికి కారణం. వినోదరంగాన్ని ఇంతకాలం నాయకులు చిన్న చూపు చూసారు. కానీ ఇప్పుడు వినోద పరిశ్రమ స్థాయిని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలు సైతం సినీరంగంలో ఎదిగేందుకు ఉన్న అపారమైన అవకాశాల గురించి ఆరాలు తీస్తున్నారు. ముఖ్యంగా పాన్ వరల్డ్ లో హాలీవుడ్ కి ధీటుగా దూసుకెళ్లే సత్తా భారతీయ సినిమాలకు ఉందని, పెట్టుబడులు పెట్టడానికి పనికొచ్చే పరిశ్రమ ఇది అని ఇప్పటికి నమ్ముతున్నారు. అందువల్ల భవిష్యత్ లో బడా పారిశ్రామిక వేత్తల అండదండలతో వినోద రంగం మరింత విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. ఒకప్పటిలా కాకుండా వినోదరంగ ప్రముఖులను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తున్న తీరు కూడా ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి సూచనను పరిగణించి రేవంత్ ప్రభుత్వం పూణే తరహా ఫిలిం ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తే, అలాంటి ఘనకార్యం సాధించిన మొదటి ముఖ్యమంత్రిగా ఆయనను ఇండస్ట్రీ లైఫ్ టైమ్ గుర్తుంచుకుంటుంది.