తమిళనాడులో రాజకీయ గందరగోళం... హీరోలకు తలనొప్పిగా మారనుందా?
రాజకీయ సెగలు సినిమా రంగంపై ఎలా పడుతున్నాయి? విజయ్ ప్రమాణ స్వీకారం హీరోల ప్లాన్స్‌ని ఎలా మార్చేస్తోంది? ఇప్పుడు ఇవే కోలీవుడ్‌లో హాట్ టాపిక్..;
తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా 'రాజకీయం' వర్సెస్ 'సినిమా' అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకవైపు దళపతి విజయ్ తన 'TVK' పార్టీతో సంచలనం సృష్టించి అధికారం దిశగా అడుగులు వేస్తుంటే, మరోవైపు సూర్య నటించిన 'కరుప్పు' వంటి భారీ చిత్రాలు విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. రాజకీయ సెగలు సినిమా రంగంపై ఎలా పడుతున్నాయి? విజయ్ ప్రమాణ స్వీకారం హీరోల ప్లాన్స్‌ని ఎలా మార్చేస్తోంది? ఇప్పుడు ఇవే కోలీవుడ్‌లో హాట్ టాపిక్..
కరుప్పుకు గ్రహణం:
ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష జంటగా రూపొందిన 'కరుప్పు' సినిమాకి అడ్డంకులు తీరడం లేదు. గతేడాది దీపావళి నుంచే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఎట్టకేలకు మే 14న విడుదల చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. కానీ, ఇప్పుడు తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం చూస్తుంటే ఆ తేదీపై మళ్ళీ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇక ర్శకుడు బాలాజీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ ట్రైలర్ విడుదల ఆలస్యమవుతుందని హింట్ ఇచ్చారు.
విజయ్ ప్రమాణ స్వీకారం - అసలు చిక్కు ఇక్కడే:
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 'TVK' అత్యధిక స్థానాలు సాధించినా, మేజిక్ ఫిగర్ అందకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ మే 14 లోపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అంతా రాజకీయంపైనే ఉంటుంది. ఇలాంటి టైం లో సినిమాను విడుదల చేయడం భారీ రిస్క్ అని మేకర్స్ భావిస్తున్నారు. ప్రమోషన్స్ కు కూడా మీడియాలో చోటు దొరకని పరిస్థితి ఉండటంతో 'కరుప్పు' యూనిట్ డైలమాలో పడిందని టాక్ .
మే నెల సినిమాలకు గండం:
సాధారణంగా వేసవి సెలవుల సీజన్ కావడంతో మే నెలలో పెద్ద సినిమాలు క్యూ కడతాయి. కానీ, ఈసారి ఎన్నికల ఫలితాల తర్వాతి పరిణామాలు సినిమా వాళ్లకు తలనొప్పిగా మారాయి. విజయ్ ప్రమాణ స్వీకారం చేసే రోజున తమిళనాడు అంతా పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అయితే, దీనివల్ల సినిమాల రిలీజ్ ప్లాన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. ఎందుకంటే థియేటర్ల వద్ద భద్రతా పరమైన ఇబ్బందులు వస్తాయని కొందరు సినిమాలను జూన్‌కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.
రాజకీయంగా విజయ్‌కి ఇది పెద్ద మైలేజ్ ఇచ్చే అంశం కావచ్చు కానీ, ఇక ఈ నెలలో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి, ఇక జై, మీనాక్షి గోవిందరాజన్ నటిస్తున్న సత్తెండ్రు మారుదు వానిలై మూవీ మే 15 న రిలీజ్ కానుంది.ఇక మాయన్,మూన్ వాక్,లక్ష్మీకాంతన్ కొలై వజక్కు,ఇలా కొన్ని సినిమాలు మే లో రానున్నాయి. ఇక కొన్ని వాయిదా పడనున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాలతో విసిగిపోయిన సూర్య ఫ్యాన్స్‌కు ఇది మరో దెబ్బే. మరో రెండు రోజుల్లో రాజకీయ ఉత్కంఠ వీడితేనే 'కరుప్పు' థియేటర్లలోకి వస్తుంది, లేదంటే 'పోస్ట్‌పోన్' అనే బోర్డు తప్పదు అని సమాచారం.
సినిమా, రాజకీయం విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో ఇప్పుడు రాజకీయం సినిమాలను డామినేట్ చేస్తోంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి సీటు కోసం సాగిస్తున్న పోరాటం ఒకవైపు, సినిమా రిలీజ్, వాయిదాలతో మూవీ ఇండస్ట్రీ ఒకవైపు, ఇక ఏది ఏమైనా ఈ రాజకీయ తుపానులో తట్టుకొని నిలబడగలిగే సినిమాలు ఏవో చూడాలి .