హీరోల రెవెన్యూపై నిర్మాతల మండలి గొడ్డలి వేటు
థియేటర్ యజమానుల సంఘం, పంపిణీదారుల సంఘం ప్రతినిధులతో సినిమాల విడుదల నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు.;
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) ఆదివారం చెన్నైలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సంచలన ప్రకటన చేసింది. ఇకపై స్టార్ హీరోలతో నిర్మాతలు రెవెన్యూ షేరింగ్ మోడల్ ని అనుసరిస్తారని ప్రకటించింది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం విడుదలల మోడల్ లో మార్పులను ప్రవేశపెట్టింది. పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇప్పుడు లాభాల్లో వాటా నమూనాను అనుసరించాలి. అగ్ర హీరోలు, సాంకేతిక నిపుణులు లాభాలు, నష్టాలు రెండింటినీ నిర్మాతలతో షేర్ చేసుకోవాలని కౌన్సిల్ ప్రకటించింది. థియేటర్ ల ద్వారా రాబడిని పెంచడం, కోలీవుడ్ లో మారుతున్న వ్యవహారాలకు అనుగుణంగా మారాల్సిన ఆవశ్యకతను ఇది నిర్ధారిస్తుంది.
తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ వంటి అగ్ర హీరోలు నటించిన చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే ముందు ఎనిమిది వారాల గడువును పాటించాలని టిఎఫ్‌పిసి ఆదేశించింది. మధ్య స్థాయి హీరోల చిత్రాలు ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదలకు అర్హతను పొందుతాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు నాలుగు వారాల తర్వాత విడుదలకు అనుమతి ఉంటుంది.
థియేటర్ యజమానుల సంఘం, పంపిణీదారుల సంఘం ప్రతినిధులతో సినిమాల విడుదల నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతియేటా విడుదలయ్యే 250 చిన్న మధ్యస్థ బడ్జెట్ తో రూపొందించే చిత్రాలు థియేటర్లలోకి రిలీజ్ సమస్య లేకుండా చూసుకోవడం ఈ కమిటీ బాధ్యత అని టిఎఫ్ పిసి పేర్కొంది. చిన్న నిర్మాతలకు అవకాశాలను పెంచాలనే అజెండాను దీనిలో చర్చించారు.
డిజిటల్ సినిమాలపై దృష్టి సారిస్తే థియేట్రికల్ బిజినెస్ దెబ్బ తింటుంది గనుక, వెబ్ ఓటీటీ కంటెంట్ కంటే సినిమాల నిర్మాణంపైనే దృష్టి సారించాలని నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు సూచించారు. దీనిని ఉల్లంఘించిన వారికి పని లేకుండా ఆపాలని నిర్ణయించారు. థియేటర్ యజమానులు అలాంటి వ్యతిరేక శక్తుల సినిమాలను ప్రదర్శించవద్దని సూచించింది. థియేట్రికల్ రిలీజ్.. ఓటీటీ, శాటిలైట్ మార్గాలలో ఆదాయం బాగా తగ్గిపోయిన ఈ తరుణంలో తమిళ నిర్మాతల మండలి ప్రకటన ఆసక్తిని రేకెత్తించింది.
ప్రభుత్వ స్థలాలు ప్రదేశాలలో షూటింగ్‌ల కోసం క్రమబద్ధీకరించబడిన సింగిల్ విండో అనుమతి వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. స్థానిక సేవా పన్ను తగ్గింపు నిర్ణయం సహా సినీ కార్మికుల నివాసాలకు భూమి కేటాయింపు వంటి సౌలభ్యానికి తమిళనాడు ప్రభుత్వానికి టిఎఫ్ పిసి కృతజ్ఞతలు తెలిపింది.