తమిళ డైరెక్టర్స్‌కు ఏమైంది? ఏంటీ పరిస్థితి?
తమళ డైరెక్టర్లకు సౌత్‌తో పాటు దేశ వ్యాప్తంగా మంచి పేరున్న విషయం తెలిసిందే.;
తమళ డైరెక్టర్లకు సౌత్‌తో పాటు దేశ వ్యాప్తంగా మంచి పేరున్న విషయం తెలిసిందే. తమ ప్రతి సినిమాలోనూ తమిళ నేటివిటీని చూపిస్తూ భాషాభిమానం, ప్రాతీయాభిమానాన్ని చాటుకుంటూ కాన్సెప్ట్ ఓరియొండెట్ సినిమాలతో ఆకట్టుకుంటుంటారు. అలాంటి క్రేజీ స్టార్ డైరెక్టర్లు ఈ మధ్య పట్టుని కోల్పోతున్నారు. వరుస ఫ్లాపుల్ని, డిజాస్టర్లని ఎదుర్కొంటూ షాక్‌కు గురి చేస్తున్నారు. ఇందులో బ్లాక్ బస్టర్లని అందించిన డైరెక్టర్లతో పాటు హేమా హేమీలతో క్లాసిక్‌లని అందించిన వారు కూడా ఉండటం తమిళ ఇండస్ట్రీ వర్గాలని కలవరానికి గురి చేస్తోంది.
తమిళ డైరెక్టర్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు మణిరత్నం. నాయకుడు, దళపతి, సఖి, ముంబాయ్ వంటి క్లాసిక్ సినిమాలని అందించిన ఈ దిగ్దర్శకుడు ఇప్పుడు పట్టుని కోల్పోయాడా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. గత గత కొంత కాలంగా ఆయన డిజాస్టర్లని ఎదుర్కొంటూ షాక్ ఇస్తున్నారు. `పొన్నియిన్ సెల్వన్` సీరిస్‌తో తమిళంతో ఫరావాలేదనిపించిన మణిరత్నం తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మాత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయారు.
తాజాగా కొన్నేళ్ల విరామం తరువాత కమల్‌తో ఆయన `థగ్ లైఫ్` మూవీని రూపొందించారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఆక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే కేవలం రూ.89 కోట్లని రాబట్టి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఇదే తరహాలో మరో సీనియర్ డైరెక్టర్, టెక్నాలజీతో వండర్స్ క్రియేట్ చేసిన శంకర్ కూడా ఇదే తరహాలో వరుస షాకులిస్తున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన `ఇండియన్ 2`, `గేమ్ ఛేంజర్` సినిమాలు వరుసగా డిజాస్టర్‌లుగా నిలిచి దారుణ ఫలితాల్ని అందించాయి.
ఈయనన తరహాలోనే మరో తమిళ దర్శకుడు భారీ డిజాస్టర్‌ని అందించి షాక్ ఇచ్చాడు. ఆయనే సిరుతై శివ. కెమెరామెన్‌గా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మారిన ఆయన ఇటీవల సూర్య హీరోగా `కంగువ` మూవీని రూపొందించాడు. ఫాంటసీ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొంది కేవలం వంద కోట్లలోపే రాబట్టి మేకర్స్‌కి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలనుకున్న హీరో సూర్యకు మర్చిపోలేని షాక్ ఇచ్చింది.
ఈ సినిమా ఫ్లాప్ నుంచి బయటపడాలని సూర్య చేసిన మరో ప్రయత్నం `రెట్రో`. కార్తీక్ సుబ్రాజ్ డైరెక్ట్ చేసిన ఈ రెట్రో మూవీ హీరో సూర్యకు హీరోగానూ, నిర్మాతగానూ భారీ నష్టాలని తెచ్చి పెట్టింది. పీరియాడిక్ స్టోరీ అని, రెట్రో టైమ్ స్టోరీ అని సూర్య బలంగా నమ్మి చేసిన ఈ మూవీతో కార్తీక్ సుబ్బరాజు భారీ షాక్ ఇచ్చాడు. వరుసగా క్రేజీ డైరెక్టర్లు, క్లాసిక్స్ అందించిన దర్శకులు ఇలా వరుస డిజాస్టర్లు ఇస్తుండటంతో తమిళ ప్రేక్షకులు ఈ డైరెక్టర్స్‌కి ఏమైంది అని వాపోతున్నారట. చివరికి ఏ.ఆర్. మురుగాదాస్ కూడా `సికందర్`తో సల్మాన్‌కు డిజాస్టర్‌ని అందించి షాక్ ఇవ్వడంతో తమిళ ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారట.