వరల్డ్ కప్ ఫైనల్.. ఆ 'మూవీ'లపై గట్టి ఎఫెక్ట్ పడినట్లు ఉందే..
టాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఆదివారం పెద్ద సవాల్ ఎదురైందని చెప్పాలి.;
టాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఆదివారం పెద్ద సవాల్ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై దృష్టి పెట్టడంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక చాలా వరకు తగ్గిపోయింది. దీంతో కొత్తగా విడుదలైన పలు చిత్రాల కలెక్షన్లపై గట్టి ఎఫెక్ట్ పడినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్ సరస్వతి, మెన్షన్ హౌస్ మల్లేశ్ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాల మేకర్స్.. వీకెండ్ పై మంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆదివారం పరిస్థితి మాత్రం వారి అంచనాలకు పూర్తిగా భిన్నంగా మారింది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వైపే అంతా మొగ్గు చూపారు.
ఎక్కువ మంది ప్రేక్షకులు టీవీల ముందు లేదా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో మ్యాచ్ ను వీక్షించడానికే ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో ఆదివారం సాయంత్రం, రాత్రి షోలకు థియేటర్లలో పెద్దగా ఆడియన్స్ కనిపించలేదని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రేక్షకులు లేకపోవడంతో ఏకంగా షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి.
దీంతో ఆయా సినిమాల అసలు సంగతి.. సోమవారం కలెక్షన్లపై ఆధారపడి ఉంది. ఆదివారం తగ్గిన వసూళ్లను సోమవారం కొంతమేర కవర్ చేసుకుంటాయన్న ఆశతో నిర్మాతలు, థియేటర్ యజమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వర్కింగ్ డే అయినప్పటికీ సాయంత్రం షోలు, రాత్రి షోలు కాస్త అయినా ప్రేక్షకులను ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా, క్రికెట్ మ్యాచ్ కారణంగా సినిమాల కలెక్షన్లు ప్రభావితమవుతాయన్నది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరోసారి ప్రూవ్ చేసింది. గతంలో కూడా క్రికెట్ మ్యాచ్ లు, ముఖ్యంగా టీమ్ ఇండియా ఆడే కీలక మ్యాచ్‌లు జరిగిన రోజుల్లో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా టీ20 టోర్నీ సెమీ ఫైనల్స్ టైమ్ లో కూడా అదే జరిగింది.
అయితే చిన్న సినిమాలు మంచి మౌత్ టాక్ తెచ్చుకుంటేనే వర్కింగ్ డేస్ లోనూ నిలబడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మొదటి వీకెండ్ లోనే కలెక్షన్లు పడిపోవడం వల్ల థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది. ప్రస్తుతం విడుదలైన ఆ చిత్రాలకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా సోమవారం నుంచి వచ్చే రోజుల్లో ఆయా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లలో కొనసాగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.