SVC నుంచి మరో భారీ మూవీ.. రూమర్స్ వేళ శిరీష్ రెడ్డి అనౌన్స్మెంట్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలుపై టాలీవుడ్‌ లో మరోసారి చర్చ మొదలైంది.

Update: 2026-05-13 06:16 GMT

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలుపై టాలీవుడ్‌ లో మరోసారి చర్చ మొదలైంది. ఆ అంశంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో రెంటల్ పద్ధతిలో సినిమాలు విడుదల అవుతున్నాయని, కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలులో ఉందని ఆయన గుర్తుచేశారు. అదే విధానం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎవరినీ టార్గెట్ చేసే పోరాటం కాదని, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేశారు.

"మేం పర్సంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నామంటే అది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. థియేటర్లు బతకాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సరైన విధానం రావాలి" అని శిరీష్ రెడ్డి పేర్కొన్నారు. టికెట్ రేట్ల అంశంపైనా ఆయన కీలక హామీ ఇచ్చారు. ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవోలు వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచబోమని ప్రేక్షకులకు హామీ ఇస్తున్నామని వెల్లడించారు.

ఆ ప్రకటన ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇటీవల పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శిరీష్ కామెంట్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం మరొకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (SVC) నుంచి త్వరలో ఓ భారీ సినిమా ప్రకటించబోతున్నామని శిరీష్ రెడ్డి వెల్లడించారు. "ఒక నెలలో పెద్ద తెలుగు సినిమాను మీడియా ముందే అనౌన్స్ చేస్తాం. మేం పెద్ద సినిమాలు చేయడం లేదని ఎవరు అనుకోవద్దు. చిన్న చిత్రాలు మాత్రమే చేస్తున్నామనే ప్రచారంలో నిజం లేదు. అందుకే పర్సంటేజ్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తున్నామని కాదు.. మేము ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాం" అని అన్నారు.

ఇటీవల SVC బ్యానర్‌ పై భారీ ప్రాజెక్టులు తగ్గాయని, కొత్త స్టార్ హీరో సినిమా కోసం సంస్థ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరీష్ రెడ్డి చేసిన ప్రకటన ఆసక్తిని పెంచుతోంది. శిరీష్ రెడ్డి ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ లో కీలక భాగస్వామి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సోదరుడు అయిన ఆయన, సంస్థ నిర్మాణ వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో వచ్చే అనేక చిత్రాలకు నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్‌ లో వరుస విజయాలతో గుర్తింపు పొందిన ఆ బ్యానర్ నుంచి వచ్చే కొత్త ప్రకటనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏదేమైనా ఒకవైపు థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానంపై పోరాటం కొనసాగుతుండగా, మరోవైపు SVC నుంచి భారీ సినిమా రాబోతుందన్న ప్రకటన వైరల్ గా మారింది.




Tags:    

Similar News