ప్రమోషన్లకు నిర్మాత రాంరాం?

ఈ దెబ్బతో ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయాడీ స్టార్ ప్రొడ్యూసర్.;

Update: 2025-10-17 06:26 GMT

టాలీవుడ్ నిర్మాతల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ అని మాత్రమే కాక.. సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్, అగ్రెసివ్ అని కూడా పేరు సంపాదించాడు సూర్యదేవర నాగవంశీ ఒక టైంలో. ఐతే విజయాల్లో ఉన్నంత వరకు ఎం చేసినా చెల్లిపోతుంది. కానీ ఫెయిల్యూర్లు వచ్చినపుడే అంతా తిరగబడిపోతుంది. కొన్ని నెలల ముందు వరకు ఆయనకు అంతా బాగానే కలిసి వచ్చింది. సంక్రాంతికి ‘డాకు మహారాజ్’, వేసవిలో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో విజయాలందుకున్నాడు.

కానీ తర్వాతే కథ అడ్డం తిరిగింది. తన ప్రొడక్షన్లో వచ్చిన ‘కింగ్డమ్’, తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘వార్-2’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో కుదేలైపోయాడు నాగవంశీ. ఆ సినిమాల గురించి రిలీజ్ ముంగిట చేసిన కామెంట్ల వల్ల ట్రోలర్స్‌కు దొరికిపోయాడు. ఆ చిత్రాలు అతను చెప్పినంత గొప్పగా లేకపోవడం.. వాటి ఫలితం గురించి అతను ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా తిరగబడడంతో కొన్ని రోజుల పాటు నాగవంశీని ఒక ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు.

ఈ దెబ్బతో ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయాడీ స్టార్ ప్రొడ్యూసర్. తర్వాతి నన్ను మిస్సవుతున్నారా అంటూ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటిలా అయితే యాక్టివ్‌గా లేడు. మామూలుగా తన కొత్త సినిమా రిలీజవుతుంటే.. సోషల్ మీడియాలో వరుసబెట్టి పోస్టులు పెట్టడంతో పాటు.. టీంలో అందరికంటే ముందుగా మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇంటర్వ్యూలివ్వడం చేస్తుంటాడు. కానీ ‘మాస్ జాతర’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ప్రమోషన్ల జోలికి రావట్లేదు.

హీరో రవితేజనే ఒకటికి రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు భాను భోగవరపు కూడా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కానీ నాగవంశీ మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానుండగా.. రిలీజ్ ముంగిట కూడా నాగవంశీ మీడియాకు ఇంటర్వ్యూలివ్వడం లాంటిదేమీ చేయకపోవచ్చని తెలుస్తోంది. మహా అయితే ప్రెస్ మీట్‌, ప్రి రిలీజ్ ఈవెంట్లకు హాజరు కావచ్చు. వాటికి వచ్చినా ఇంతకుముందులా అగ్రెసివ్‌గా మాట్లాడే అవకాశాలైతే కనిపించడం లేదు.

Tags:    

Similar News