'వీరభద్రుడు' మూవీ రివ్యూ
ఒక మంచి హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం 'కరుప్పు'.. తెలుగులో 'వీరభద్రుడు'గా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నటీనటులు: సూర్య - త్రిష - ఆర్.జె.బాలాజీ - స్వసిక - శశివద - ఇంద్రన్స్ - నటరాజన్ - సుప్రీత్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
ఛాయాగ్రహణం: జి. కె.విష్ణు
మాటలు: రాకేందు మౌళి
నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు-సురేష్ ప్రభు
కథ - స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఆర్.జె.బాలాజీ
ఒక మంచి హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం 'కరుప్పు'.. తెలుగులో 'వీరభద్రుడు'గా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సూర్య పరాజయ పరంపరకు ఈ చిత్రమైనా అడ్డుకట్ట వేసేలా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ: ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న మీను అనే అమ్మాయి తన నగలు దొంగతనానికి గురికావడంతో తన తండ్రితో కలిసి కేసు పెడుతుంది. ఐతే తన నగలు దొరికినా సరే వాటిని కోర్టు నుంచి తీసుకోవడం కష్టం అవుతుంది. మీను కేసును టేకప్ చేసిన బేబీ కృష్ణ (ఆర్.జె.బాలాజీ) కేసు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంటాడు. తన కూతురి కోసం మీను తండ్రి వచ్చి పూజ చెయ్యడంతో వీరభద్ర స్వామి గుడిలోని దేవుడే సూర్య (సూర్య) అనే మనిషిలా వచ్చి బేబీ కృష్ణకు బుద్ధి చెప్పి మీను సమస్య పరిష్కరించాలని ప్రయత్నిస్తాడు. మరి ఈ క్రమంలో సూర్యకి ఎదురైన అనుభవాలు ఏంటి? కోర్టుల్లో పరిస్థితులు చూశాక సూర్య ఏం చేశాడు? బేబీ కృష్ణతో సూర్య పోరు ఎక్కడిదాకా వెళ్ళింది? చివరికి సూర్య అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: కోర్టుల్లో జరిగే కాలయాపన.. అక్కడ సామాన్యులకు అర్థం కాని వ్యవహారాలు.. జడ్జీలు-లాయర్ల అవినీతి.. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కే జనం పడే అవస్థలు.. ఈ విషయాలన్నింటినీ స్పృశిస్తూ.. ఈ వ్యవస్థను సరి చేయడానికి దేవుడే దిగి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ మీద ‘వీరభద్రుడు’ సినిమాను నడిపించాడు ఆర్.జె.బాలాజీ. అతడి చివరి చిత్రం ‘మూకుత్తి అమ్మన్’లో తన భక్తుల్ని కాపాడే అమ్మవారి కథను పాత స్టయిల్లో చెప్పిన బాలాజీ నుంచి కొత్తదనం ఆశించలేమని ఆ సినిమా చూసిన వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ప్రయోగాలకు పేరు పడ్డ సూర్య నటిస్తున్నాడంటే ఇందులో ఏదో కొత్తదనం ఉందని ఆశిస్తే నిరాశ తప్పదు. కోర్టులో సామాన్యుల సమస్యల గురించి చూపించిన విధానం బాగున్నా.. దేవుడితో ముడిపెట్టి చూపించిన పరిష్కారంలో ఏం వైవిధ్యం కనిపించదు. ఎంత దేవుడి కథ అయినా సరే.. లాజిక్ అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని పూర్తిగా కొండెక్కించేసి ఇష్టం వచ్చినట్లు కథాకథనాలను నడిపించిన బాలాజీ.. ‘వీరభద్రుడు’ను అర్థం పర్థం లేని సినిమాగా తయారు చేశాడు. సూర్య పెర్ఫామెన్స్.. కొన్ని ఎలివేషన్ సీన్లు.. గ్రాఫిక్స్ వరకు బాగున్నా.. సినిమాలో అసలు విషయం మాత్రం అంతంతమాత్రమే.
తనను నమ్ముకున్న వాళ్లు కష్టాల్లో ఉంటే దేవుడొచ్చి కాపాడే కథలు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం. మళ్లీ అలాంటి కథను చెప్పాలనుకున్నపుడు అందులో ఏదో ఒక కొత్తదనం.. లేదా గమ్మత్తైన విషయం ఉండాలి. ‘వీరభద్రుడు’లో ఒక చోట ఆ దేవుడికి విలన్ పెట్టే మెలిక చూసి.. ఈ కథ రసవత్తర మలుపు తీసుకునేలా ఉందే అనిపిస్తుంది. తనను శిక్షించబోయిన దేవుడికి విలన్ ఒక ఛాలెంజ్ చేస్తాడు. మీ దైవశక్తిని వాడకుండా సామాన్యుడిలా వచ్చి న్యాయ వ్యవస్థతో పోరాడండి.. నీ క్లయింటుని కాపాడుకోండి అని. ఈ ఛాలెంజ్ ప్రకారం దేవుడు సామాన్యుడిలా మారి ఎలా కేసు గెలిచాడనే నేపథ్యంలో ఈ కథను నడిపించి ఉంటే ‘వీరభద్రుడు’ వేరే స్థాయిలో ఉండేదేమో. కానీ అలా కథను నడిపించాలంటే అందుకు పకడ్బందీ కథనం కావాలి. బలమైన సన్నివేశాలుండాలి. కానీ బాలాజీ అంత కష్టపడకుండా దేవుడి మాయాజాలం మీదే సింపుల్ గా కథను నడిపించి మమ అనిపించాడు. విలన్ సవాలును స్వీకరించాక తర్వాతి సీన్లోనే దేవుడు తన శక్తిని వాడేసి అనుకున్నది సాధించేయడంతోనే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బ తినేసింది. మళ్లీ వచ్చి విలన్ ఆ కండిషన్ గుర్తు చేస్తే ఒక సీన్ వరకు సైలెంటుగా ఉండే దేవుడి పాత్ర.. ఆ తర్వాత అంతా తన మాయాజాలంతో ఏం అనుకుంటే అది చేసుకుంటూ ముందుకు పోతుంది. హీరో పాత్రకు అసలు ఛాలెంజ్ అంటూ ఏమీ ఉండదీ సినిమాలో. దీంతో సినిమా ఫ్లాట్ గా తయారైంది. సూర్యకు ఆర్జే బాలాజీ విలన్ పాత్ర చేయడమే మైనస్ అంటే.. తన పాత్ర మరింత బలహీనంగా మారడంతో సినిమాకు అది అతి పెద్ద ప్రతికూలతగా మారింది.
హీరో సామాన్యుడిగా కనిపించి దైవశక్తి అండతో అతను విజృంభిస్తే వచ్చే కిక్కు.. హీరోనే దేవుడిగా చూపిస్తే రాదు. ‘వీరభద్రుడు’లో కూడా ఇదే జరిగింది. ఇందులో హీరో పాత్ర ఏంటి అన్నది మరిచిపోయి మామూలుగా చూస్తే యాక్షన్ ఘట్టాలు.. ఎలివేషన్లు బాగానే అనిపిస్తాయి. కానీ హీరోది దేవుడి పాత్ర కావడం వల్ల ఆయా సన్నివేశాలు మరీ గొప్పగా ఏమీ అనిపించవు. ఐతే గ్రాఫిక్స్ ను సరిగ్గా వాడుకుంటూ దేవుడి పాత్రను దృశ్యపరంగా ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం బాగుంది. సినిమా అంతా కూడా విజువల్ గా సూపర్ అనిపిస్తుంది. కానీ కథాకథనాలు మాత్రం ఎగుడుదిగుడుగా అనిపిస్తాయి. దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా పని చేస్తుందో చెప్రే ప్రయత్నంలో భాగంగా ఒక కేసు నేపథ్యంలో నడిచే తొలి అరగంట మరీ సాగతీతగా అనిపిస్తుంది. హీరో పాత్ర ప్రవేశించే వరకు ఊపు రాదు. కానీ వీరభద్రుడి రాకతో కొంత ఉత్సాహం వచ్చినా.. తర్వాతి సన్నివేశాలు తేలిపోయాయి. ఇంటర్వెల్ వరకు కాస్త పర్వాలేదు అన్నట్లు నడిచే ‘వీరభద్రుడు’ ద్వితీయార్దంలో మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. దేవుడి మహిమల నేపథ్యంలో ఫ్లాట్ గా సాగిపోయే సెకండాఫ్ లో ఏ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్ కూడా సాధారణంగానే అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘వీరభద్రుడు’ సూర్య గత చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. కొంత మేర మాస్ కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి. విజువల్ గా సినిమా బాగుంది. అంతకుమించి ఇందులో కొత్తదనం మాత్రం ఏమీ కనిపించదు.
నటీనటులు: వీరభద్రుడి పాత్రలో చూడడానికి సూర్య భలేగా అనిపిస్తాడు. 50 ఏళ్ల వయసులో తన లుక్ అదిరిపోతుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తన నటన ఓకే కానీ.. తన నుంచి ఆశించే ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇందులో చూడలేం. కేవలం ఫైట్లు చేయడం తప్పితే తన పాత్ర ఇందులో చేసేదేమీ లేదు. త్రిష పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. నటన కూడా మామూలుగా సాగిపోయింది. కొన్ని సన్నివేశాల్లో త్రిష బాగా అనిపించినా.. కొన్ని సీన్లలో మరీ బక్కచిక్కిన లుక్ లో అంత ఆకర్షణీయంగా లేదు. వయసు-ఓవర్ మేకప్ ప్రభావం కనిపించింది. అనుకున్నట్లే విలన్ పాత్రలో ఆర్.జె.బాలాజీ తేలిపోయాడు. సూర్య ముందు తన పాత్ర కానీ-నటన కానీ నిలవలేకపోయాయి. మలయాళ నటుడు ఇంద్రన్స్ చాలా బాగా చేశాడు. తన పాత్ర ప్రేక్షకులను కదిలిస్తుంది. శశివద ఓకే. స్వశిక.. నటరాజన్.. సుప్రీత్.. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం: ‘డ్యూడ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి అభ్యంకర్.. తొలిసారి ఓ పెద్ద స్టార్ సినిమాకు సంగీతం అందిస్తూ బలమైన ముద్ర వేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ.. చాలా వరకు సినిమాకు సూట్ కాని మ్యూజిక్ ఇచ్చాడు. ఇదేమో గ్రామీణ దేవుడి చుట్టూ తిరిగే కథ. కానీ అతను చాలా మోడర్న్ గా అనిపించే బీజీఎం ఇచ్చాడు. తన పాటలు జస్ట్ ఓకే అనిపించాయంతే. జి.కె.విష్ణు ఛాయాగ్రహణం అదిరిపోయింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగా చేశారు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మంచి క్వాలిటీతో సినిమా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ రైటింగ్-టేకింగ్ లో కొత్తదనం చూపించలేకపోయాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. దాన్ని ఎగ్జిక్యూషన్ తేలిపోయింది. కథనంలో ఎక్కడా నిలకడ చూపించలేకపోయాడు. లాజిక్ పూర్తిగా పక్కన పెట్టి తోచినట్లుగా సన్నివేశాలు రాసి తీసేశాడు.
చివరగా: వీరభద్రుడు.. మహిమ పని చేయలేదు
రేటింగ్- 2.25/5