సైకో కిల్లర్ వర్సెస్ ఖాకీ.. మద్యలో కామెడీ!
నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న 'సీన్' క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ, ఇందులో ప్రధాన బలం కామెడీయేనని టీమ్ పదే పదే చెబుతుండటం విశేషం.
సూర్య ఖాకీ చొక్కా తొడిగితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో 'సింగం' సిరీస్ ఇప్పటికే ప్రూవ్ చేసింది. అయితే ఈసారి ఆయన రొటీన్ గాల్లో ఎగిరే ఫైట్లు, భారీ డైలాగుల జోలికి వెళ్లడం లేదు. 'రోమాంచం', 'ఆవేశం' లాంటి సినిమాలతో మలయాళంలో సరికొత్త క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు జితు మాధవన్ తమిళ ఎంట్రీ కోసం సూర్యతో కనెక్ట్ అయ్యాడు.
నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న 'సీన్' క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ, ఇందులో ప్రధాన బలం కామెడీయేనని టీమ్ పదే పదే చెబుతుండటం విశేషం. హత్యలు, డెడ్ బాడీలు, సైకో కిల్లర్ల చుట్టూ తిరిగే కథలో కామెడీ ఏ స్థాయిలో ఇమిడిపోతుందనేది ఈ సినిమా ముందున్న అతిపెద్ద సవాలు. 'ప్రేమలు' సినిమాలో అమాయకపు కుర్రాడిగా అందరినీ మెప్పించిన నస్లెన్, ఇందులో ఈశ్వరన్ అనే క్రూరమైన సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
హత్యలను సోషల్ మీడియాలో లైవ్ చూపించే ఒక పైశాచిక స్వభావం ఉన్న విలన్ పాత్రను పెట్టుకుని, థియేటర్లో ఆడియన్స్ ను నవ్విస్తామని చెప్పడం నిజంగా కత్తిమీద సామే. సూర్య సైతం దుబాయ్ ప్రమోషన్స్ లో మర్డర్ మిస్టరీ కంటే జితు రాసుకున్న హ్యూమర్ సీన్లే హైలైట్ అవుతాయని చెప్పడం ఆసక్తికరంగా మారింది. డీఎస్పీ ఇంబరాజ్ గా సూర్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు.
కరోనా కాలం నాటి ఇన్వెస్టిగేషన్ తో పాటు, రఫ్ గడ్డంతో ఉన్న లుక్ డిఫరెంట్ గా ఉంది. సూర్య, రాజ్ప్రియన్ కాంబినేషన్ లో వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్లను దర్శకుడు ఎంత సీరియస్ గా నడిపించాడనే దానిపైనే స్క్రీన్ ప్లే గ్రిప్ ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సాగుతున్నప్పుడు వచ్చే కామెడీ ట్రాక్ కథ వేగాన్ని దెబ్బతీస్తే మొత్తం థ్రిల్ గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.
సూర్య, జ్యోతిక సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా, లాల్, ఆనంద్రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ఆవేశం' బ్లాక్ బస్టర్ కు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. ఒకవైపు వెన్నులో వణుకు పుట్టించే సీరియల్ కిల్లర్, మరోవైపు పొట్టచెక్కలయ్యే నవ్వులు.. ఈ రెండు భిన్నమైన జోనర్లను బ్యాలెన్స్ చేయడంలో జితు మాధవన్ విజయం సాధిస్తే సూర్య ఖాతాలో మరో ప్రయోగాత్మక హిట్ పడ్డట్టే.