మరో టాలీవుడ్‌ దర్శకుడితో సూర్య సినిమా..?

సూర్య మరోసారి తెలుగు దర్శకుడితో వర్క్‌ చేసేందుకు రెడీగా ఉన్నాడనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఒక తెలుగు సినిమా కన్ఫర్మ్‌ అయిందనే పుకార్లు పుట్టుకు వస్తున్నాయి.

Update: 2026-09-11 18:30 GMT

కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య ఇటీవల 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు నిర్మాత నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించాడు. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల జాబితాలో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులో సినిమా పెద్ద ఎత్తున విడుదలైంది. సినిమాకు తమిళనాట కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్ రికార్డ్‌లు చెబుతున్నాయి. అందుకే సూర్య మరోసారి తెలుగు దర్శకుడితో సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందుకే పలువురు తెలుగు రచయితలు, దర్శకులను పిలిపించుకుని మరీ కథలు వింటున్నాడు అంటూ తమిళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అదేం లేదని సూర్య సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు.

సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ సినిమా...

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ వంటి భారీ విజయాన్ని ఇచ్చినందుకు కచ్చితంగా తెలుగు దర్శకుడు అయిన వెంకీ అట్లూరి పై సూర్యకు అభిమానం ఉండటం ఖాయం. అంతే కాకుండా మరోసారి తెలుగు దర్శకుడితో సినిమాను చేయాలి అని సూర్య భావించడం కూడా నిజమే అయ్యి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సూర్య ఏ తెలుగు దర్శకుడికి ఓకే చెప్పలేదు అనేది వాస్తవం. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూర్య సినిమా అనే వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. త్రివిక్రమ్‌ కారణంగానే విశ్వనాథ్ అండ్‌ సన్స్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది అనే ప్రచారం కూడా ఉంది. అయితే త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఉన్న బిజీ కారణంగా సూర్యతో సినిమా చేసే అవకాశం లేదు. రాబోయే రెండు మూడు ఏళ్ల వరకు సూర్య, త్రివిక్రమ్‌ కాంబో సెట్‌ కాకపోవచ్చు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ సినిమాకు చాలా సమయం పడుతుంది కనుక సూర్య మూవీ గురించి ఇప్పట్లో ఎలాంటి అప్‌డేట్‌ ఉండక పోవచ్చు.

టాలీవుడ్‌ దర్శకుడితో సూర్య....

సూర్య మరోసారి తెలుగు దర్శకుడితో వర్క్‌ చేసేందుకు రెడీగా ఉన్నాడనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఒక తెలుగు సినిమా కన్ఫర్మ్‌ అయిందనే పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. కానీ సూర్య ఇప్పటికే తన లైనప్‌ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పటికే జితు మాధవన్‌ దర్శకత్వంలో 'సీన్‌' అనే సినిమాను చేసిన సూర్య దాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల విడుదల తేదీని ప్రకటించాడు. ఈ ఏడాదిలో సూర్య నుంచి రాబోతున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. ఒక స్టార్‌ హీరో ఏడాదిలో మూడు సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం సూర్యకు మాత్రమే చెల్లింది అనడంలో సందేహం లేదు. సీన్‌ తర్వాత సూర్య చేయాల్సిన సినిమా కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. త్వరలోనే ఆ సినిమా గురించి అధికారిక సమాచారం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో సూర్య...

సూర్య తన 49వ సినిమాను హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ అయిందని, స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. గతంలో వీరి కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సూర్య 49వ సినిమా హెచ్‌ వినోద్‌ తో చేయడం దాదాపు కన్ఫర్మ్‌, ఇక సూర్య 50వ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం అంటున్నారు. రోలెక్స్ పాత్రతో లోకేష్ కనగరాజ్ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ మాత్రం ఇంకా రాలేదు. సూర్య తన 50వ సినిమా వరకు లైనప్‌ రెడీ చేసుకున్నాడు. కనుక ఇప్పటికిప్పుడు తెలుగు దర్శకుడితో సినిమా అంటే లేదనే చెప్పాలి. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే.

Tags:    

Similar News