సూర్య మైల్‌స్టోన్ మూవీకి రెండు తరాల దర్శకుల పోటీ!

ఈ ఇద్దరిలో ఎవరి వైపు సూర్య అడుగు వేస్తార‌న్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Update: 2026-09-04 12:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 50వ సినిమా సహజంగానే ప్రత్యేకమైనది. కానీ ఈసారి ఆ ప్రత్యేకత కేవలం సంఖ్యలో మాత్రమే లేదు. సూర్య 50 చుట్టూ వినిపిస్తున్న డైరెక్ట‌ర్ల పేర్లు చూస్తుంటే, ఇది రెండు తరాల సినిమా ఆలోచనల మధ్య జరగబోయే ఆస‌క్తిక‌ర‌మైన‌ ఎంపికలా కనిపిస్తోంది. ఒకవైపు భారీ కమర్షియల్ విజన్‌కు ప్రతీకగా నిలిచిన శంకర్.. మరోవైపు కొత్త తరం ప్రేక్షకుల అభిరుచిని మార్చేసిన సినిమాటిక్ యూనివర్స్ బ్రాండ్ లోకేష్ కనగరాజ్. ఈ ఇద్దరిలో ఎవరి వైపు సూర్య అడుగు వేస్తార‌న్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

శంకర్‌తో సినిమా అంటే భారీ కాన్వాస్, గ్రాండ్ విజువల్స్, సోష‌ల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ టచ్, పాన్ ఇండియా స్థాయి ప్రెజెంటేషన్ గుర్తుకు వస్తాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ అంటే వేగంగా సాగే కథనం, డార్క్ యాక్షన్ వ‌ర‌ల్డ్, క్యారెక్ట‌ర్ల‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధానం. ముఖ్యంగా విక్ర‌మ్ సినిమా క్లైమాక్స్ లో క‌నిపించిన‌ రోలెక్స్ పాత్రకు వచ్చిన విపరీతమైన క్రేజ్ కారణంగా సూర్య- లోకేష్ కాంబినేషన్‌పై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.

అయితే సూర్య తన 50వ సినిమాను ఎవరితో చేయాల‌నే విష‌యంలో డెసిష‌న్ లో తొందరపడకపోవడం కూడా గమనించాల్సిన విషయం. ఆల్రెడీ త‌న 48వ సినిమా టీ.జే. జ్ఞానవేల్‌తో, 49వ సినిమా హెచ్. వినోద్‌తో లైన్‌లో పెట్టిన సూర్య‌, 50వ సినిమాకు ముందు ఆయన ఒక రకమైన సేఫ్టీ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. వరుసగా సినిమాలను పూర్తి చేస్తూ, మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ కోసం సరైన కథ, సరైన డైరెక్ట‌ర్, సరైన టైమ్ కోసం ఎదురుచూడాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు 50వ సినిమా అంటే కేవలం ఫ్యాన్స్ కు ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్, ప్రత్యేకమైన కథ, మార్కెట్ స్థాయి, పాన్ ఇండియా అవకాశాలు అన్నీ ఒక్కసారిగా ఆ ప్రాజెక్ట్‌పై పడతాయి. ఒకప్పుడు కెరీర్‌లో జ‌స్ట్ మరో సినిమాగా మాత్రమే భావించిన మైల్‌స్టోన్ ప్రాజెక్టులు ఇప్పుడు హీరోలకు భారీ రిస్క్‌గా మారుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే అదే సినిమా ఫ్యాన్స్ లో నిరాశను కూడా పెంచే అవకాశం ఉంటుంది.

అందుకే సూర్య 50లో అసలు ప్రశ్న శంకర్ లేదా లోకేష్ ఎవరు అన్నది మాత్రమే కాదు. సూర్య తన త‌ర్వాతి కెరీర్ దిశగా ఎలాంటి సినిమా భాషను ఎంచుకుంటార‌న్నదే కీలకంగా మారింది. గత తరం భారీ కమర్షియల్ విజన్ వైపా? లేక కొత్త తరం యాక్షన్ యూనివర్స్ వైపా? ఈ డెసిష‌నే సూర్య50 ప్రాజెక్టును ఒక రెగ్యుల‌ర్ మైల్‌స్టోన్ మూవీగా కాకుండా, ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మార్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News