పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..
| నటి సురేఖా వాణికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని వెల్లడించారు. వాటిని వెంటనే తొలగించాలని మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లను హెచ్చరించారు. ప్రైవేట్ కంటెంట్‌ను వైరల్ చేసే వారిపై సైబర్ క్రైమ్ కేసులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తుంటుంది. ముఖ్యంగా వారి పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలను బయటపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నటి సురేఖా వాణికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆమె స్పందించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సురేఖా వాణికి సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియో గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇన్ స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆ వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు వీడియో గురించి కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంపై అనవసరంగా చర్చించడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సురేఖా వాణి స్వయంగా స్పందిస్తూ ఓ నోట్ విడుదల చేశారు.
తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందని సురేఖా వాణి వెల్లడించారు. తన పర్మిషన్ లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఆ కంటెంట్ ను ఎవరూ షేర్ చేయొద్దని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు వెంటనే దాన్ని ఆపాలని కోరారు. కేవలం వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఒకరి పర్సనల్ లైఫ్ ను యూజ్ చేసుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
తన ప్రైవేట్ కంటెంట్ ను రీపోస్ట్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను వైరల్ చేస్తున్న అకౌంట్స్, వ్యక్తుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రూఫులు సేకరిస్తున్నట్లు తెలిపారు. తన పర్సనల్ కంటెంట్ ను ప్రచారం చేసే వారిపై కఠినమైన సైబర్ క్రైమ్ కేసులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సురేఖా వాణి క్లారిటీ ఇచ్చారు.
ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. తన పర్సనల్ ప్రైవసీని గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తున్న సోషల్ మీడియా పేజీలకు ఆమె వార్నింగ్ గట్టిగానే చేరినట్లయింది. అయితే సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చినప్పుడు వాటిని నిజానిజాలు తెలుసుకోకుండా వైరల్ చేయడం సమస్యగా మారుతోంది. ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ కంటెంట్ ను వైరల్ చేయడం వల్ల వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కంటెంట్ ను షేర్ చేయడం సరైన పద్ధతి కాదు.
ఇక సురేఖ విషయానికి వస్తే.. 2005లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భద్ర, బొమ్మరిల్లు, ఏమాయ చేశావే, నాయక్, బాద్‌షా వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్, ఫొటోషూట్లతో తరచూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు.