ఏడాది క్రితం 40వ ఏట ఏం చేసారో బయోగ్రఫీలో రాసిన రజనీ ఇప్పుడేం రాస్తున్నారు?
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అసాధారణ క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అసాధారణ క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఎప్పుడూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ నెలలోనే రజనీకాంత్ తన జీవితకథతో ఆటోబయోగ్రఫీ స్వయంగా రాస్తున్నారనే సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `జైలర్ 2` షూటింగ్‌లో తన పార్ట్ పూర్తి చేసారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో కానీ లేదా దీపావళి కానుకగా కానీ విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి షూటింగ్‌ల నుండి కాస్త విరామం దొరకడంతో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి రజనీకాంత్ ఊటీ వెళ్లారు. అక్కడ లభించిన అమూల్యమైన ఖాళీ సమయాన్ని ఆయన పూర్తిగా తన బయోగ్రఫీని పూర్తి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించారు.
రజనీకాంత్ `కూలీ` తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ బయోగ్రఫీకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. రజనీకాంత్ గత ఏడాది కాలంగా ఈ పుస్తక రచనను కొనసాగిస్తున్నప్పటికీ అది ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా `కూలీ` చివరి రెండు షెడ్యూల్స్ జరుగుతున్న సమయంలో రజనీకాంత్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా తన ఆటోబయోగ్రఫీని రాస్తూనే ఉన్నారని లోకేష్ అప్పట్లోనే స్పష్టం చేశారు. షూటింగ్ విరామ సమయంలో లభించే కొద్దిపాటి వ్యవధిని కూడా సూపర్ స్టార్ తన జీవిత కథను అక్షరబద్ధం చేయడానికే కేటాయించడంపై నిబద్ధతను వివరించడం ఆశ్చర్యపరిచింది.
తన 42వ ఏట జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయాలను నాతో పంచుకునేవారని లోకేష్ తెలిపారు. సూపర్ స్టార్ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరితోనూ షేర్ చేయని ఎన్నో వ్యక్తిగత రహస్య విషయాలను ఈ చర్చల సందర్భంగా తనతో షేర్ చేసుకున్నారని ఆ అనుభవం తన గుండెకు హత్తుకున్నాయని లోకేష్ చెప్పారు. ఒక సాధారణ కండక్టర్ స్థాయి నుండి గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో రజనీకాంత్ ఎదుర్కొన్న అనేక అడ్డంకులు.. వాటిని ఆయన అధిగమించిన తీరే కేవలం తనకే కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆయన్ని కనెక్ట్ చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు.
రజనీకాంత్ ఈ బయోగ్రఫీని పూర్తి చేయాలనే ఆసక్తితో ఇప్పుడు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన తదుపరి చిత్రంగా `తలైవర్ 173` లైన్‌లో ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం భారీ ఎత్తున నిర్మితం కానుంది. దీనికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించనున్నారు.