సౌత్ దర్శకులకు బాలీవుడ్‌లో భలే డిమాండ్
ఒకప్పుడు సౌత్ ఇండియన్ భాషల సినిమాను బాలీవుడ్ వారు చిన్న చూపు చూసే వారు. సౌత్ హీరోలను గురించి, సౌత్ ఫిల్మ్ మేకర్స్ గురించి బాలీవుడ్‌లో చిన్నతనంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.;
ఒకప్పుడు సౌత్ ఇండియన్ భాషల సినిమాను బాలీవుడ్ వారు చిన్న చూపు చూసే వారు. సౌత్ హీరోలను గురించి, సౌత్ ఫిల్మ్ మేకర్స్ గురించి బాలీవుడ్‌లో చిన్నతనంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సౌత్‌లో ఒకప్పుడు రూపొందిన సినిమాలతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అందుకే బాలీవుడ్‌లో సౌత్ సినిమాల యొక్క క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పలువురు సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్‌లో వచ్చిన సినిమాలను చూడాలని ఆశ పడుతున్నారు. ఇక హిందీ స్టార్స్ దాదాపు అందరూ సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మొదలుకుని పలువురు స్టార్ హీరోలు సౌత్ దర్శకులతో చేశారు, ముందు ముందు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాలీవుడ్ స్టార్స్‌తో సౌత్ దర్శకుల సినిమాలు
షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ చేసిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నేపథ్యంలో మరింత మంది సౌత్ దర్శకులకు బాలీవుడ్ నుంచి పిలుపు దక్కింది. అమీర్ ఖాన్ త్వరలోనే వంశీ పైడిపల్లితో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ తో రణబీర్ కపూర్ యానిమల్ చేయడం, దాదాపుగా ఆ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ దర్శకులు ఎంతో మంది నార్త్ ఇండియాలో జెండా పాతారు. అందుకే మరింత మంది సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సన్నీ డియోల్, గోపీచంద్ జాట్ సూపర్ హిట్
ఆ మధ్య సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన జాట్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆ సినిమాను జనాలు ఓటీటీలో తెగ చూస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఓటీటీ లో ట్రెండ్ అయిన హిందీ యాక్షన్ సినిమాగా జాట్ నిలిచింది. అందుకే హీరో సన్నీ డియోల్ మరోసారి సౌత్ దర్శకుడితో వర్క్ చేయాలని ఆశ పడుతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు ప్రారంభించాడని తెలుస్తోంది. సన్నీ డియోల్ పలు కథలు విన్నారని, అందులోని కొన్ని కథలను ఇప్పటికే ఫైనల్ చేశారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఒక సౌత్ ఇండియన్ దర్శకుడితో సన్నీ డియోల్ యొక్క కొత్త సినిమా ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత మరో సౌత్ దర్శకుడితోనూ ఆయన సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వరుస సినిమాలతో సన్నీ డియోల్
బాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన సన్నీ డియోల్ వరుసగా ఫ్లాప్స్ చవిచూడటంతో ఆయన పనైపోయిందని అంతా అన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు, ఆయన చేయనూ లేదు. కానీ ఆయన గదర్ 2 తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ సినిమా విజయం సాధించి జోష్ మీద ఉన్న సమయంలోనే వచ్చిన 'జాట్' సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన తిరిగి బిజీ అయ్యారు.
జాట్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో సన్నీ డియోల్ సౌత్ దర్శకులతో రెగ్యులర్‌గా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. అందుకే వెంటనే తదుపరి సినిమాను సౌత్ దర్శకుడితోనే చేయాలని భావిస్తున్నాడు. అతి త్వరలోనే ఆ దర్శకుడు ఎవరు? వారి కాంబోలో సినిమాను నిర్మించబోతున్న నిర్మాణ సంస్థ ఏంటి అనేది అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2026లో సన్నీ డియోల్‌తో ఆ సౌత్ దర్శకుడు రూపొందించబోతున్న సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.