'డాన్ 3' వివాదాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద హీరో రాజకీయం?
ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడం, ఆ తర్వాత తలెత్తిన వివాదాలపై సీనియర్ నటుడు సునీల్ శెట్టి స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడం, ఆ తర్వాత తలెత్తిన వివాదాలపై సీనియర్ నటుడు సునీల్ శెట్టి స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రణ్‌వీర్‌కు మద్దతుగా నిలుస్తూ ఏ సంస్థా ఒక నటుడిని బ్యాన్ చేయలేదని సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సునీల్ శెట్టి ఇటీవల వరుసగా ఇస్తున్న ప్రకటనల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటూ నెటిజన్లు ఎక్కువగా రాజకీయ రంగు పులుముతున్నారు.
సునీల్ శెట్టి వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నెటిజన్లు... ఆయన త్వరలోనే బిజెపి నుండి లోక్‌సభ సీటు ఆశిస్తున్నారని... అందుకోసమే ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గతంలో వచ్చిన క్లాసిక్ కామెడీ చిత్రం `హేరా ఫేరి` లోని ప్రధాన నటులైన అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి.. ముగ్గురూ ఇప్పుడు హార్డ్‌కోర్ బిజెపి మద్దతుదారులుగా మారిపోయారంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. సునీల్ శెట్టికి త్వరలోనే అధికార పార్టీ నుండి పిలుపు రావడం ఖాయమంటూ నెటిజన్లు పొలిటికల్ లింకులతో ట్రోల్స్ మొదలుపెట్టారు.
మరికొందరు నెటిజన్లు సునీల్ శెట్టి నటించిన ఐకానిక్ చిత్రం `ధడకన్`లోని పాత్రలను గుర్తుచేస్తూ ఫన్నీ మీమ్స్ సృష్టించారు. ఆ సినిమాలో హీరోయిన్ అంజలి తండ్రి పాత్ర (సునీల్ శెట్టిని తిట్టే క్యారెక్టర్) అప్పట్లోనే కరెక్ట్‌గా ప్రవర్తించాడని.. ఆయన సునీల్ శెట్టిని కాకుండా వేరే వ్యక్తిని అల్లుడిగా ఎంచుకుని మంచి పని చేశాడంటూ జోకులు పేల్చారు. ``నువ్వు అప్పుడు బేతమీజ్... ఇప్పుడు బేతమీజ్`` అంటూ సినిమాలో సునీల్ శెట్టిని ఉద్దేశించిన డైలాగులను కామెంట్ సెక్షన్‌లో వాడుకుంటూ నెటిజన్లు వినోదాన్ని పంచుతున్నారు.
మరోవైపు రణ్‌వీర్ సింగ్ చిత్ర పరిశ్రమకు 3,500 కోట్ల రెవెన్యూ తెచ్చిపెట్టాడని సునీల్ శెట్టి వ్యాఖ్యానించగా, దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ``సార్... మీ జీవితకాలంలో మీరు అంత కలెక్షన్ సాధించి ఉండకపోవచ్చు.. కానీ ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు, నైతికత - సినిమాపై ఉండే కమిట్‌మెంట్ గురించి`` అంటూ గట్టి కౌంటర్లు ఇచ్చారు. అలాగే ఈ `డాన్ 3` వివాదమంతా కేవలం సినిమా పబ్లిసిటీ కోసం ముందే ప్లాన్ చేసుకున్న ఒక ``స్క్రిప్టెడ్ డ్రామా`` అని కొందరు కొట్టిపారేయగా, రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నందున మళ్లీ షారుఖ్ ఖాన్‌నే ``డాన్`` పాత్రలోకి తీసుకురావాలంటూ కింగ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
అసలు సునీల్ శెట్టి కామెంట్ ఏమిటి?
`డాన్ 3` నుండి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం, ఆపై ప్రీ-ప్రొడక్షన్ నష్టాల కింద ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ 45 కోట్లు డిమాండ్ చేయడంతో తలెత్తిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో సీనియర్ నటుడు సునీల్ శెట్టి రణ్‌వీర్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ... చిత్ర పరిశ్రమకు దాదాపు 3,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఒక ప్రతిభావంతమైన నటుడిని లేదా కళను బ్యాన్ చేసే హక్కు ఎవరికీ లేదని.. ఒకవేళ అలా చేస్తే సుప్రీం కోర్టే ఆ నిర్ణయాన్ని కొట్టేస్తుందని వాదించారు. ఈ వివాదం కారణంగా తొలుత `ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్` (FWICE) రణ్‌వీర్‌పై జారీ చేసిన `నాన్-కోఆపరేషన్` ఆదేశాలు చట్టవిరుద్ధమని రణ్‌వీర్ లీగల్ టీమ్ వాదించగా.. చివరికి ఐఎంపిపిఏ మధ్యవర్తిత్వంతో ఈ సమస్య సద్ధుమణిగి నిషేధాజ్ఞలు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఫర్హాన్, రణ్‌వీర్ ఇద్దరూ వివేకవంతులని.. కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని సునీల్ శెట్టి ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ వివాదాల కారణంగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంది. రణ్‌వీర్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరనేది మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.