నారంగ్ వర్సెస్ నాగవంశీ: స్పెక్ట్స్ పెట్టుకొని బోడి తల వేస్కోని.. డూప్లికేట్ హెయిర్ ఉంటుంది..!

నారంగ్ మాట్లాడుతూ.. " క్యా నామ్ హై బేటా... స్పెక్ట్స్ పెట్టుకొని బోడి తల వేస్కోని డూప్లికేట్ హెయిర్ ఉంటుంది.

Update: 2026-05-14 05:26 GMT

`స్పెక్ట్స్ పెట్టుకొని.. బోడి తల వేస్కోని.. డూప్లికేట్ హెయిర్ ఉంటుంది..!తెలంగాణ‌ ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ ప్రొడ్యూస‌ర్స్ వివాదంలో ఏషియ‌న్ నారంగ్ తాజా పంచ్‌లు ఇవి. ఆయ‌నెవ‌రో తెలియ‌దు అన్న‌ట్టుగానే ఎక్స్ ప్రెష‌న్ పెట్టిన నారంగ్ చివ‌రికి ఆ నిర్మాతను `నాగ‌వంశీ అంటారు! అంటూ వ్యంగ్యంగా పంచ్ విసిరారు. ఎగ్జిబిట‌ర్ల‌తో నిర్మాత‌ల‌ వివాదం కేవ‌లం ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ను దాటుకుని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల ఫ‌ర్వానికి తెర తీయ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా వేడెక్కించేస్తోంది.

అస‌లు ఈ వివాదం ఎక్క‌డ మొద‌లైంది? అనే వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లి తెలంగాణ‌ ఎగ్జిబిట‌ర్ల చ‌ర్చా స‌మావేశంలో ఏషియ‌న్ సునీల్ నారంగ్ సింగిల్ థియేట‌ర్ల మ‌నుగ‌డ క‌ష్టాల గురించి మాట్లాడ‌టాన్ని నాగ‌వంశీ త‌ప్పు ప‌ట్ట‌డంతో ఈ వివాదం తీవ్ర‌త‌ర‌మైంది. ప్రస్తుతం మల్టీప్లెక్సులలో డాల్బీ అట్మాస్ వంటి అధునాతన సౌండ్ సిస్టమ్స్ .. హై-క్వాలిటీ ప్రొజెక్షన్ అందించగలుగుతున్నామని... కానీ సింగిల్ స్క్రీన్లలో అటువంటి భారీ పెట్టుబడులతో కూడిన సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదని సునీల్ నారంగ్ ఎగ్జిబిట‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. డాల్బీ వంటి కనీస ఆధునిక సౌకర్యాలు లేని థియేటర్లకు నేటి తరం ప్రేక్షకులు ఎలా వస్తారని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు నిర్మాత నాగవంశీ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దాదాపు 300 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్న ఒక పెద్ద ఎగ్జిబిటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల బాధల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయ‌న‌ పేరు ప్ర‌స్థావించకుండానే నాగ‌వంశీ ఎద్దేవా చేశారు. ఎ సెంట‌ర్ల‌లోనే కాదు.. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ.. ఆఖరికి బీ, సీ సెంటర్‌లలో కూడా మల్టీప్లెక్సులు నిర్మించి.. సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను లాగేసుకుంటున్న వ్యక్తి ఇలా సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది! అని నాగవంశీ కౌంటర్ వేసారు.

మల్టీప్లెక్సుల మీద చూపిస్తున్న శ్రద్ధలో పదో వంతు కూడా సింగిల్ స్క్రీన్ల మీద చూపడం లేదని నాగవంశీ విమర్శించారు. ఒకవైపు మల్టీప్లెక్సులను విలాసవంతంగా తీర్చిదిద్దుతూ..మరోవైపు సింగిల్ స్క్రీన్లను కుక్క తొట్టి లాగా వాసన వచ్చే స్థితికి దిగజార్చారని నాగ‌వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లాభాల కోసం మల్టీప్లెక్సులను ప్రోత్సహిస్తూ.. సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే సింగిల్ స్క్రీన్లను ఎగ్జిబిటర్లే కావాలని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

అయితే `ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ మ‌ల్టీప్లెక్సులు క‌డుతున్నార‌ని నాగ‌వంశీ చేసిన కామెంట్ కి నారంగ్ సీరియ‌స్ అయ్యారు. తాను కేవ‌లం మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌లోనే కాదు.. సింగిల్ స్క్రీన్ల పోష‌ణ‌లోను రాజునే అని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. నారంగ్ మాట్లాడుతూ.. ` క్యా నామ్ హై బేటా... స్పెక్ట్స్ పెట్టుకొని బోడి తల వేస్కోని డూప్లికేట్ హెయిర్ ఉంటుంది..అత‌డు ఎవ‌రు? అవును నాగవంశీ అంటారు..అని కూడా సెటైరిక‌ల్ గా స్పందించారు.

`ఆయనకు ఈ లిస్ట్ చూపించండి` అంటూ తెలంగాణలో తాను నిర్మించిన 33 సింగిల్ థియేటర్ల వివరాలను ఒక ప‌త్రం ద్వారా ఏషియ‌న్ నారంగ్ బయటపెట్టారు. మల్టీప్లెక్స్ రంగంలోనే కాకుండా.. సింగిల్ స్క్రీన్ల అభివృద్ధిలోనూ తాము కీలక పాత్ర పోషిస్తున్నామని స్పష్టం చేశారు.

కేవలం ఉన్న వాటిని నిర్వహించడమే కాకుండా.. మరో 10 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని.. ఇంకో 15 థియేటర్ల బుకింగ్ ప్రక్రియ జరుగుతోందని నారంగ్ వెల్లడించారు. మల్టీప్లెక్సుల వల్ల భారీ లాభాలు వస్తున్నాయన్న వాదనలో నిజం లేదని... అవి కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తోటి ఎగ్జిబిటర్లందరూ బాగుండాలనేదే తన తపనని..అందుకే భారత్‌లో 500కు పైగా థియేటర్లను నిర్మించాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు.

ఈ చర్చా వేదికపై ఇరువురి మధ్య సాగిన మాటల యుద్ధం టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఒకవైపు సింగిల్ స్క్రీన్లు కుక్క తొట్టిలా వాసన వస్తున్నాయని..వాటిని ఎగ్జిబిటర్లు పట్టించుకోవడం లేదని నాగవంశీ ధ్వజమెత్తగా.. తాను సింగిల్ స్క్రీన్లను పోషిస్తున్న విధానం గురించి నారంగ్ గణాంకాలతో సహా వివ‌రిస్తూ సమాధానమిచ్చారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా.. అంతిమంగా సామాన్య ప్రేక్షకుడికి నాణ్యమైన సినిమా అనుభూతిని అందించే దిశగా థియేటర్ల వ్యవస్థలో మార్పులు రావాలని పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

Tags:    

Similar News