మృణాల్ కు సుమంత్ స్పెషల్ 'సారీ'.. ఏంటి కథ?
ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సుమంత్ సరదాగా మాట్లాడుతూ.. "మృణాల్, నీ రామ్ ను నీ దగ్గర నుంచి తీసుకెళ్లినందుకు క్షమించు.;
టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీగా గుర్తింపు పొందిన సీతారామం విడుదలై సంవత్సరాలు గడిచినా, ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సుమంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఆయన చెప్పిన సారీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ సుమంత్ ఎందుకు క్షమాపణలు చెప్పారంటే.. సీతారామం సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన ఈవెంట్ లో బయటపెట్టారు. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ హీరోయిన్ గా నటించగా, సుమంత్ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సినిమాలో మృణాల్, దుల్కర్ మధ్య ఉన్న ఒక ముఖ్యమైన సీన్ ఎడిటింగ్ సమయంలో తొలగించాల్సి వచ్చిందని తెలిపారు.
ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సుమంత్ సరదాగా మాట్లాడుతూ.. "మృణాల్, నీ రామ్ ను నీ దగ్గర నుంచి తీసుకెళ్లినందుకు క్షమించు. నిజానికి ఒక మంచి సీన్ ఉంది. కానీ పరిస్థితుల వల్ల దాన్ని తీయాల్సి వచ్చింది" అని చెప్పారు. ఆయన మాటలకు అక్కడ నవ్వులు పూశాయి. అదే సమయంలో ఆ సీన్ తీసేయడం వల్ల మృణాల్ కు జరిగిన నష్టానికి కాంపెన్సేషన్ గా డెకాయిట్ సినిమాలో అవకాశం ఇచ్చామని కూడా సరదాగా పేర్కొన్నారు.
ఇక డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. చిత్రంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం యాక్షన్, లవ్, ఎమోషన్స్ కలగలిపిన కథతో తెరకెక్కింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం విశేషం.
అలాగే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సుమంత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ పరంగా చూస్తే, ఆ సినిమా ఇద్దరు మాజీ ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. పరిస్థితుల వల్ల విడిపోయిన వారు, కొన్ని దోపిడీల కారణంగా మళ్లీ ఎలా కలుసుకున్నారు? వారి మధ్య ప్రేమ, ద్రోహం, ప్రతీకారం ఎలా మలుపులు తిరిగింది? అనే అంశాలపై కథ సాగుతుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మృణాల్ కు ఆ సినిమా మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి, ఒక చిన్న సీన్ కట్ అయిన విషయం నుంచి ప్రారంభమైన ఆ సరదా సారీ కామెంట్ ఇప్పుడు సినిమా ప్రమోషన్‌కు మంచి హైప్ తీసుకువచ్చిందని చెప్పాలి.