అల్లు అర్జున్‌ కు కోర్టు నోటీసులు.. ఎందుకంటే..

ఛార్జ్‌ షీట్‌ ను పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసు విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో నిందితులకు సమన్లు జారీ చేసింది.

Update: 2026-06-19 09:39 GMT

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం మరోసారి ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేసు విచారణలో భాగంగా సోమవారం నాడు కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అల్లు అర్జున్‌ తో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరికీ సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం కేసు విచారణ నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్లనుంది.

2024 డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌ లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు చేరుకున్నారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో ఆ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సినిమా ప్రీమియర్ షోల సెక్యూరిటీ, ఆడియెన్స్ కంట్రోలింగ్, నిర్వాహకుల బాధ్యతలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఆ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు చాలా కాలంపాటు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్‌ షీట్ దాఖలు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ ను ఏ11 నిందితుడిగా చేర్చగా, ఏ 1 నుంచి ఏ 10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు, ప్రజలను నియంత్రించలేకపోవడం వంటి అంశాలను పోలీసులు దర్యాప్తులో పరిశీలించారు.

ఛార్జ్‌ షీట్‌ ను పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసు విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయినట్లు సమాచారం. వీరంతా కోర్టు ఎదుట హాజరైన తర్వాత కేసు ట్రయల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్‌ పై నమోదైన కేసు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది.

పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా ఆ వ్యవహారం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. అనంతరం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, తర్వాత రెగ్యులర్ బెయిల్ లభించింది. దీంతో ఆయన ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటన కేవలం ఒక క్రిమినల్ కేసుగానే కాకుండా, పెద్ద సినిమాల విడుదల సమయంలో సెక్యూరిటీ మెజర్స్ అవసరాన్ని గుర్తు చేసిన ఇన్సిడెంట్ గా నిలిచింది.

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే పరిస్థితుల్లో థియేటర్లు, నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై ఆ ఘటన చర్చకు తెరలేపింది. ఇక నాంపల్లి కోర్టు తాజా సమన్లతో కేసు విచారణ మరో కీలక స్టేజ్ లోకి వెళ్లిందనే చెప్పాలి. సోమవారం నాడు నిందితుల హాజరు అనంతరం కోర్టు తదుపరి విచారణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో న్యాయపరమైన ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుందన్నదానిపై అందరి దృష్టి నెలకొంది.

Tags:    

Similar News