సుమంత్ రెడ్డి.. సుమంత్ ప్రభాస్ గా ఎలా మారారు?
టాలీవుడ్ లో కొత్త తరహా కంటెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ పేరు వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
టాలీవుడ్ లో కొత్త తరహా కంటెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ పేరు వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులకు సుమంత్ ప్రభాస్ గా పరిచయమైన ఆ యంగ్ టాలెంట్ అసలు పేరు సుమంత్ రెడ్డి. అయితే తనకు ఇష్టమైన హీరోపై ఉన్న అభిమానం ఆయన పేరును మార్చుకునేలా చేసిందట.
చిన్నప్పటి నుంచే ప్రభాస్ సినిమాలపై మక్కువ పెంచుకున్న సుమంత్, ముఖ్యంగా బుజ్జిగాడు సినిమా చూసిన తర్వాత ఆయనకు డార్లింగ్ పై విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం తర్వాత తన పేరులో భాగమైంది. 8వ తరగతి చదువుతున్న సమయంలో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, సుమంత్ రెడ్డి అనే పేరు ఇప్పటికే తీసుకున్నారని ఫేస్ బుక్ చెప్పింది.
దీంతో ఇష్టమైన హీరో పేరు యాడ్ చేసి సుమంత్ ప్రభాస్ గా యూజర్ నేమ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి స్నేహితులు, తెలిసిన వాళ్లందరూ అదే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. ఆ పేరే సిల్వర్ స్క్రీన్ పైకి కూడా వచ్చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, చదువులో కాన్సంట్రేషన్ పెరగాలని ఉద్దేశంతో ఆయన తల్లి చదువుకునే సమయంలో ప్రభాస్ ఫోటో ముందుంచేదట. ఆ చిన్న చిన్న సంఘటనలు ఆయనలో అభిమానాన్ని మరింత పెంచాయి.
అదే అభిమానంతో తన పేరులో ప్రభాస్ ను చేర్చుకోవడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇక సుమంత్ ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన మొదట యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నీతో చెప్పాలని వంటి షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కంటెంట్ పై పట్టుతో, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆయన కెరీర్‌లో మలుపుతిప్పిన చిత్రం మేమ్ ఫేమస్. ఆ సినిమాతో హీరోగా, దర్శకుడిగా ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ప్రభాస్, తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించారు. దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం, రూ.6.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి లాభాలను అందించింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించారు.
ప్రత్యేకంగా మహేష్ బాబు, రాజమౌళి వంటి ప్రముఖులు ప్రశంసించడం విశేషం. కొత్త ఆలోచన, నేచురల్ స్టోరీ ఆయన ప్రత్యేకతగా నిలిచాయి. ఇక ప్రస్తుతం సుమంత్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం గోదారి గట్టుపైన. అందులో రాజు అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఆ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్స్, లవ్, లైఫ్ జర్నీ వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఏదేమైనా ఒక ఫ్యాన్ తన ఇష్టమైన హీరో పేరును తన పేరులో చేర్చుకుని.. గుర్తింపు పొందడం అరుదైన విషయం. తక్కువ సమయంలోనే నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన ఆయన జర్నీ యూత్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.