‘మండాడి’.. రగ్గడ్ లుక్‌తో సుహాస్ తమిళ ఎంట్రీ
నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ 16వ చిత్రం ఎమోషనల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.;
టాలీవుడ్ లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే సుహాస్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా అదే తరహాలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సైడ్ క్యారెక్టర్ నుంచి హీరోగా అంతకంతకూ తన స్టార్ డమ్ ను పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అతని మొదటి ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ కొత్త సినిమా ‘మండాడి’ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ 16వ చిత్రం ఎమోషనల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సెల్ఫీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మతిమరన్ పుగజేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తుండగా, తెలుగు నటుడు సుహాస్ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆకర్షణీయంగా రూపొందుతోంది.
ఇప్పటికే సూరి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, తాజాగా సుహాస్ లుక్‌ను కూడా ఆవిష్కరించారు. సముద్ర తీరంలో ‘సునామీ రైడర్స్’ జట్టుతో కలిసి నిలబడి, నీలం రంగు జెర్సీలో, బూడిద రంగు జుట్టుతో, లుంగీ ధరించి సుహాస్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్‌లు తమ పడవలను నడుపుతూ సీరియస్ ఏమోషన్ తో కనిపించారు.
ఈ లుక్స్ చూస్తే ఇద్దరి మధ్య భారీ క్లాష్ ఉండనుందని అర్థమవుతోంది. సుహాస్ ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అతని తమిళ డెబ్యూకు పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. ‘మండాడి’ సినిమా కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇది డిఫరెంట్ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది.
సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ లాంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, సినిమాకు అత్యున్నత సాంకేతికతను అందించేందుకు టాప్ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా విజువల్ ట్రీట్‌గా రూపొందుతోంది.
ఇక 2025 ఆగస్టు 15న సినిమా విడుదల కానుందని సమాచారం. సుహాస్ ఈ చిత్రంతో తమిళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడని, సూరితో అతని ఆన్ స్క్రీన్ క్లాష్ సినిమాకు హైలైట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ‘మండాడి’ సినిమా సుహాస్‌కు తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ను తీసుకు వస్తుందో చూడాలి.