ప్రేమ, పెళ్లి పుకార్లపై సుడిగాలి సుధీర్‌ని కడిగేసిన సత్తి..!
సుధీర్ 'గోట్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో హీరోయిన్ దివ్య భారతి కూడా పాల్గొన్నారు.
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎదిగిన సుధీర్ సినిమాల్లోనూ తన అదృష్టంను పరీక్షించుకుంటున్నాడు. సినిమాల్లో ఇప్పటి వరకు లక్ కలిసి రాలేదు. అయినా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. హీరోగా సుధీర్ నటించిన 'గోట్' సినిమా విడుదలకు రెడీ అయింది. చాలా కాలం క్రితమే ఈ సినిమా ప్రారంభం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది ఉంటుందా లేదా అనే అనుమానాల మధ్య ఇటీవలే సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా రాబోతున్న గోట్ ప్రమోషన్ లో సుధీర్ హీరోయిన్‌తో కలిసి పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా సుధీర్ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకోవడం, ఇంటర్వ్యూల్లో సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకోవడం చేస్తున్నాడు.
సుడిగాలి సుధీర్ గోట్ మూవీ...
సుధీర్ 'గోట్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో హీరోయిన్ దివ్య భారతి కూడా పాల్గొన్నారు. బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఫన్నీగా, అందరినీ ఆకట్టుకునే విధంగా అడుగుతూ ఉంటాడు. ఎవరూ అడగని విషయాలను కూడా జోక్‌గానే బిత్తిరి సత్తి అడుగుతూ, సిల్లీగా జోకులు వేస్తూ, గెస్ట్‌ల నుంచి రాబట్టాల్సింది రాబడుతూ ఉంటాడు. సుధీర్ టీవీల్లో ఎక్కువగా కనిపిస్తాడు కానీ, పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయటకు రానివ్వడు. సుధీర్ కి పెళ్లి అయిందనే ప్రచారం ఉంది. కానీ అది నిజం కాదు. ఆ విషయాన్ని కూడా సుధీర్ బయటకు వచ్చి ఇంతకు ముందు చెప్పిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ తన రిలేషన్‌షిప్స్ గురించి స్పందించాడు. బిత్తిరి సత్తి జోక్ చేస్తున్నట్లుగానే చేస్తూ సుధీర్ ను కడిగేసినట్లుగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సుధీర్ పెళ్లి వార్తలు...
బిత్తిరి సత్తి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, యాంకర్‌తో ప్రేమలో ఉన్నావా అంటూ ప్రశ్నించిన సమయంలో సుధీర్ మాట్లాడుతూ... పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం సోలో లైఫ్ ను హ్యాపీగా సాగిస్తున్నాను. దీన్ని కాంప్లికేట్ చేసుకోవాలి అనుకోవడం లేదని సుధీర్ అన్నాడు. పెళ్లి అనే థాట్ వస్తేనే భయం వేస్తుంది అన్నట్లుగా ఫన్నీ కామెంట్స్ చేశాడు. మొత్తానికి సుధీర్ సోలోగానే ఉన్నాను, పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదు అని తేల్చి చెప్పాడు. అయితే సుధీర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పెళ్లి విషయమై చాలా ఒత్తిడి చేస్తున్నారట. సుధీర్ ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ గొడవ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు చెబుతూ ఉంటారు. కానీ గతంలో పెళ్లి నిశ్చితార్థం జరిగి క్యాన్సల్ కావడంతో మళ్లీ పెళ్లి విషయమై ఆయన ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరో వైపు రష్మి గౌతమ్ సైతం పెళ్లి విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడంతో బుల్లితెర ప్రేక్షకులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంటున్నారు. కానీ ఇద్దరూ మంచి స్నేహితులుగా మాత్రమే ఉంటామని ప్రకటించారు.
వేదవ్యాస్ దర్శకత్వంలో గోట్ మూవీ...
ఇక సుధీర్ గోట్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు వేదవ్యాస్ ఆకుల దర్శకత్వం వహించాడు. సుధీర్ ను మాస్ అండ్ క్లాస్ లుక్‌లో చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెరపై స్టార్‌డం కనబర్చుతున్న సుధీర్ కి మంచి కథ పడటం లేదు. మంచి కంటెంట్‌తో సినిమా చేస్తే కచ్చితంగా వెండి తెరపై కూడా సుధీర్ సూపర్ హిట్ కొట్టి, స్టార్‌డం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరి గోట్ తో అయినా సుధీర్ కి ఆ స్టార్‌డం దక్కేనా, ఇప్పటి వరకు దక్కని ఆ కమర్షియల్ హిట్ దక్కేనా చూడాలి. హీరోగా సుధీర్ చేస్తున్న సినిమాలు నిరాశ పరుస్తుండటంతో, ఆయన కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయాలని కొందరు అంటున్నారు. కానీ సుధీర్ మాత్రం హీరోగానే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. గోట్ ఫలితంను బట్టి సుధీర్ ఫ్యూచర్ మూవీ ప్లాన్స్ ఉంటాయేమో చూడాలి.