విశ్వక్‌సేన్ కల్ట్.. ప్లానింగ్ మామూలుగా లేదు..
విశ్వక్‌సేన్ ఈసారి మామూలు కమర్షియల్ సినిమా చేయడం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా అలవాటు లేని స్లాషర్ థ్రిల్లర్ కథతో 'కల్ట్'ను సిద్ధం చేశారు.
విశ్వక్‌సేన్ ఈసారి మామూలు కమర్షియల్ సినిమా చేయడం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా అలవాటు లేని స్లాషర్ థ్రిల్లర్ కథతో 'కల్ట్'ను సిద్ధం చేశారు. పైగా హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఎలా జరుగుతుందనే ఆసక్తి ఉండేది. కానీ లేటెస్ట్ గా బయటకొచ్చిన డిస్ట్రిబ్యూటర్ల జాబితా చూస్తే విశ్వక్‌సేన్ సినిమాకు ఇండస్ట్రీలో మంచి బజ్ దొరికినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా నైజాం హక్కులను ఏషియన్ సునీల్ తీసుకోవడం విశేషం. వైజాగ్‌లో దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ రిలీజ్ బాధ్యతలు చూస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సురేష్ మూవీస్ రంగంలోకి దిగింది. కృష్ణా జిల్లాలో అలంకార్ ప్రసాద్, గుంటూరులో పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు, సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. నెల్లూరులో శ్రీ వెంగమాంబ సినిమాస్, బెంగళూరులో కుమార్ ఫిలిమ్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి.
నిజానికి విశ్వక్‌సేన్‌కు ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం. గతంలో 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' సినిమాలకు స్వయంగా దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకుని కొత్త జానర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు తోడవడం 'కల్ట్' రిలీజ్‌కు మంచి ప్లస్‌గా మారింది.
ఈ సినిమాలో విశ్వక్‌సేన్ డీఎస్పీ సంకల్ప్ నాయక్‌గా కనిపించబోతున్నారు. గోవాలోని ఓ ఐలాండ్‌లో వందల మంది చిక్కుకోవడం, అక్కడి నుంచి బయటపడేందుకు ప్రమాదకరమైన గేమ్స్ ఎదుర్కోవడం అసలు కథ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో హింసాత్మక సన్నివేశాలు, డార్క్ థ్రిల్లర్ వాతావరణాన్ని చూపించారు. ఇలాంటి కథలకు సాధారణ మాస్ సినిమాల తరహాలో అన్ని సెంటర్లలో ఒకే రకమైన ఆదరణ ఉండకపోవచ్చు. అందుకే అనుభవం ఉన్న డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఉపయోగపడతారు.
మరోవైపు 'కల్ట్' కోసం విశ్వక్‌సేన్ టెక్నికల్ టీమ్‌ను కూడా బలంగా ఏర్పాటు చేసుకున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయగా, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తారక్ పొన్నప్ప, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రచార చిత్రాల్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
అక్టోబర్ 30న 'కల్ట్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా షూటింగ్ కూడా పూర్తవడంతో ప్రస్తుతం చివరి దశలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. విశ్వక్‌సేన్ గత సినిమాలతో పోలిస్తే ఈసారి జానర్ మాత్రమే కాదు, రిలీజ్‌కు అండగా నిలిచిన డిస్ట్రిబ్యూషన్ సంస్థల జాబితా కూడా హైలెట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏషియన్, ఎస్వీసీ, సురేష్ మూవీస్ లాంటి సంస్థలు అసలైన ఏరియాలను తీసుకోవడం విశ్వక్‌సేన్ కొత్త ప్రయోగానికి మంచి చాన్స్. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి. కలెక్షన్స్ వస్తాయో చూడాలి.