కీర్తి కంటే ముందే నిలదీసిన టాప్-5 హీరోయిన్లు!
ఆమె కంటే ముందే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ మరియు శాండల్‌వుడ్‌లలో పలువురు స్టార్ హీరోయిన్లు ఈ `మగ ప్రపంచం` తీరును ధైర్యంగా నిలదీశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హీరో డామినేషన్- మేల్ స్టార్స్ ఆత్మన్యూనతా భావంపై ఇటీవల జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తన తదుపరి వెబ్ సిరీస్ `అక్క` ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కీర్తి కొందరు హీరోల అంతర్గత భయాల వల్ల నటీమణుల ఆత్మవిశ్వాసం ఎలా దెబ్బతింటుందో బహిరంగంగానే ప్రశ్నించారు. అయితే సినీ రంగుల ప్రపంచంలో మగాళ్ల ఆధిపత్యాన్ని, నటీమణుల ఎదుగుదలను తొక్కేసే దుర్భుద్ధిని ఎండగట్టడం కీర్తి సురేష్‌తోనే మొదలుకాలేదు. ఆమె కంటే ముందే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ మరియు శాండల్‌వుడ్‌లలో పలువురు స్టార్ హీరోయిన్లు ఈ `మగ ప్రపంచం` తీరును ధైర్యంగా నిలదీశారు.
బాలీవుడ్లో మేల్ స్టార్ల ఆధిపత్యం - నేపోటిజమ్పై అత్యంత ఘాటుగా పోరాడిన కథానాయికలలో కంగనా రనౌత్ మొదటి వరుసలో ఉంటారు. బడా హీరోలు తమ పక్కన నటించే నటీమణుల ప్రాధాన్యతను, సీన్లను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తారని కంగన పలుమార్లు బహిర్గతం చేశారు. హీరోల అహాన్ని సంతృప్తి పరిచే గ్లామర్ బొమ్మలుగా మాత్రమే హీరోయిన్లను చూడాలని కోరుకుంటారని.. తమ ఉనికిని కాపాడుకోవడానికి స్వతంత్ర భావాలున్న నటీమణులను ప్రాజెక్టుల నుంచే తొలగిస్తారని కంగనా గట్టిగా నిలదీశారు. అలాగే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన తాప్సీ పన్ను సైతం హీరోల అభద్రతా భావాన్ని తరచూ ఎండగడుతూ వచ్చారు. నటనలో తమకంటే ఎక్కడ ఎక్కువ పేరు తెచ్చుకుంటారోనన్న భయంతో హీరోలు హీరోయిన్లను రీప్లేస్ చేయిస్తారని తాప్సీ ధ్వజమెత్తారు.
మలయాళ చిత్రసీమ (మాలీవుడ్) లో స్థిరపడిన పురుషాధిక్యతను సవాల్ చేయడంలో నటి పార్వతి తిరువోతు పాత్ర అత్యంత కీలకమైనది. డబ్ల్యూసీసీ ద్వారా ఇండస్ట్రీలోని పురుషాధిక్య కల్చర్‌పై ఆమె పోరాటం ప్రారంభించారు. పెద్ద హీరోల చిత్రాలలో స్త్రీలను హేళన చేసేలా.. స్త్రీ ద్వేషాన్ని పెంచేలా ఉండే డైలాగులను పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎత్తిచూపినందుకు పార్వతి ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొన్నారు. సూపర్స్టార్ల ఇగోలు దెబ్బతినడంతో తనకు అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలోని ఒక వర్గం పరోక్షంగా అడ్డంకులు సృష్టించినా ఆమె వెనక్కి తగ్గలేదు. మరోవైపు కన్నడ పరిశ్రమ (శాండల్‌వుడ్) లో `మీటూ` ఉద్యమ సమయంలో నటి శృతి హరిహరన్ మేల్ స్టార్ల ప్రవర్తనను, సెట్స్‌లో వారు చూపించే ఆధిపత్యాన్ని ధైర్యంగా బయటపెట్టి చర్చకు దారితీశారు.
దక్షిణాదిలో `లేడీ సూపర్‌స్టార్`గా ఎదిగిన నయనతార మేల్ స్టార్ల ఆధిపత్య సంస్కృతిని తన సినిమాల ఎంపిక ద్వారానే తిప్పికొట్టారు. ప్రమోషన్లు, ఆడియో లాంచ్‌లలో హీరోయిన్లను కేవలం అలంకారప్రాయంగా నిలబెట్టే ధోరణి నచ్చక తాను అటువంటి వేడుకలకు దూరంగా ఉండటం ప్రారంభించారు. కమర్షియల్ సినిమాల్లో హీరోల నీడలో పరిమిత పాత్రలు చేయడం కంటే.. తన సొంత ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించే విమెన్-సెంట్రిక్ కథలను ఎంచుకుంటూ మేల్ స్టార్ల ఆధారపడే తత్వాన్ని నయన్ గట్టిగా ప్రశ్నించారు. ఈ విధంగా నయనతార దక్షిణాదిలో నటీమణుల మార్కెట్ స్థాయిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
మొత్తానికి కీర్తి సురేష్ నుంచి కంగనా, నయనతార, పార్వతి, తాప్సీల వరకు ఈ కథానాయికలు పంచుకున్న అనుభవాలు పరిశ్రమలోని ఒక చేదు సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఒక నటి తన స్వయంకృషితో, ప్రతిభతో పైకి వస్తుంటే చూసి ఆనందించాల్సింది పోయి.. తమ స్థానానికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో ఆమెను తొక్కిపెట్టే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కెరీర్‌ను సైతం పక్కనబెట్టి ఈ కథానాయికలు చూపిన ధైర్యం..రాజీపడని నైజం భవిష్యత్ తరం నటీమణులకు ఒక కొండంత అండగా మారడమే కాకుండా.. పరిశ్రమలో సమానత్వం దిశగా అడుగులు పడేలా చేస్తున్నాయి.